Kishan Reddy Comments on CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీని విమర్శించి మజ్లిస్ ఓట్లు పొందాలని కాంగ్రెస్ కొత్త కుట్రకు తెరలేపిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. సన్నబియ్యం బియ్యం రద్దు చేస్తామని.. సీఎం స్థాయిలో వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం సరికాదని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మండిపడ్డారు. ఆదివారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/ktr-comments-on-congress-in-hydraa-presentation/
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ దొడ్డి దారిలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అనే హామీ తప్ప.. మిగిలిన హామీలన్నీ గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలుపు ఖాయమని జోస్యం చెప్పారు. ఓటు వేయకపోతే సన్నబియ్యం పథకం ఆపేస్తామని జూబ్లీహిల్స్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారంటూ బీజేపీ తరపున ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు కిషన్ రెడ్డి చెప్పారు.
ఉచిత బియ్యం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం అని కిషన్ రెడ్డి అన్నారు. కేజీ బియ్యానికి రూ. 42 కేంద్రమే ఇస్తోందని చెప్పారు. రాష్ట్రం ప్రభుత్వం కేజీ బియ్యానికి ఇచ్చేది కేవలం రూ. 15 మాత్రమే అని వెల్లడించారు. సన్న బియ్యం పథకం తమది అంటూ కాంగ్రెస్ నేతలు ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.
‘జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ మితిమీరి వ్యవహరిస్తోంది. సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారంలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని మజ్లిస్ నుంచి అద్దెకు తెచ్చుకున్నారు. ఓడిపోతామనే భయంతో పథకాలు రద్దు చేస్తామంటున్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారు. ఈ ఒక్కసీటుతో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందా.?’ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.


