Saturday, November 15, 2025
HomeతెలంగాణKishan Reddy: రేవంత్‌ రెడ్డిపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. చీము, నెత్తురుంటే ఆధారాలు చూపాలని...

Kishan Reddy: రేవంత్‌ రెడ్డిపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు.. చీము, నెత్తురుంటే ఆధారాలు చూపాలని సవాల్!

Kishan Reddy Hot Comments on CM Revanth Reddy : రాష్ట్ర అభివృద్ధిని బ్యాడ్ బ్రదర్స్ అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన సవాల్ విసిరారు. ఇవాళ రాష్ట్ర బీజేపీ కార్యాయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల గురించి సీఎం రేవంత్ రెడ్డి ఒక్క మాట మాట్లాడటం లేదని వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా.. ఏ ఒక్క హామీ అమలు చేయలేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక.. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని తెలిపారు. ఉపఎన్నికలో ఓడిపోతే తన సీఎం పదవి ఎక్కడ పోతుందోననే ఫ్రస్ట్రేషన్‌లో రేవంత్‌ రెడ్డి ఏదేదో మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి ఎద్దేవ చేశారు. ప్రజలకు ఏం చేశారో చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి సీఎంకు లేదన్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ పక్కాగా ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.

- Advertisement -

సీఎంకు చీము, నెత్తురుంటే: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కలిసిపోయాయంటూ దిగజారుడు రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపిందని కేంద్రమంత్రి కిషన్‌‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో సైతం ఇదే రకమైన ప్రచారం చేశారని అన్నారు. మాటిమాటికి బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటని ప్రచారం చేయడం సీఎం రేవంత్‌ రెడ్డికి అలవాటుగా మారిందని అన్నారు. సీఎంకు చీము, నెత్తురుంటే చేస్తున్న ఆరోపణపై ఆధారాలు చూపాలని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు.

దిల్లీ స్థాయిలో ఒప్పందం: సీఎం రేవంత్‌కు భయపడే వారు ఇక్కడ ఎవ్వరూ లేరని కిషన్‌‌రెడ్డి కౌంటర్ అటాక్ చేశారు. తెలంగాణ అభివృద్ధి విషయం, కేంద్ర ప్రభుత్వ సహకారం అంశంలో తమకు రేవంత్‌రెడ్డి సర్టిఫికెట్ అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీలా తమది అవినీతి పార్టీ కాదని వ్యాఖ్యానించారు. తాము అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వం తిన్న రూ.లక్ష కోట్లు కక్కిస్తామని ఎన్నికల్లో ప్రచారం చేశారని, లక్ష రూపాయలైన కక్కించారా.. అని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు దిల్లీ స్థాయిలో ఒప్పందం కుదిరిందని కిషన్‌రెడ్డి ఆరోపించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad