Saturday, November 15, 2025
HomeతెలంగాణKishan Reddy: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయొద్దు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయొద్దు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Kishan Reddy: హైదరాబాద్‌ నగరంలో నిధుల కొరత ఉన్నప్పటికీ అందుబాటులో ఉన్న నిధులను సమర్థవంతంగా వినియోగించి అభివృద్ధి పనులు చేపట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం జీహెచ్‌ఎంసీ పరిధిలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించారు.

- Advertisement -

“హైదరాబాద్ అంటే కేవలం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ మాత్రమే కాదు, నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది” అని కిషన్ రెడ్డి నొక్కి చెప్పారు. చిన్నపాటి వర్షానికే రహదారులు జలమయం కావడాన్ని ఆయన ప్రస్తావించారు. ఇటీవల వర్షాల వల్ల నాంపల్లిలో ఇద్దరు, సంతోష్‌నగర్‌లో ఒకరు నాలాలో కొట్టుకుపోయిన దురదృష్టకర సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

ఈ సమస్యల పరిష్కారానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. అనేక బస్తీల్లో వర్షపు నీరు, వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, డ్రైనేజీ వ్యవస్థ దెబ్బతిని తాగునీటిలో మురుగు నీరు కలిసిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

అన్ని డ్రైనేజీ వ్యవస్థలను శుభ్రం చేసి, పునరుద్ధరించాలని ఆయన ఆదేశించారు. పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్ల వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరించాలని కిషన్ రెడ్డి సూచించారు. నగరంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ చర్యల ద్వారా హైదరాబాద్‌ను సురక్షితమైన, జీవించడానికి అనువైన నగరంగా మార్చవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad