Safe usage of gas cylinders at home : ఇంటికి దీపం ఇల్లాలు అయితే, ఆ ఇంటి వంటింటికి ప్రాణం గ్యాస్ పొయ్యి. కట్టెల పొయ్యిల కాలం పోయి, ప్రతి ఇంట్లోనూ గ్యాస్ సిలిండర్ తప్పనిసరిగా మారింది. అయితే, ఈ సౌకర్యం వెనుక ఓ పెద్ద ప్రమాదం పొంచి ఉందన్న నిజాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. రోజూ చేసే చిన్న చిన్న పొరపాట్లు, ఏమంత కాదులే అనుకునే నిర్లక్ష్యం.. ఒక్కోసారి అంతులేని విషాదాన్ని మిగులుస్తున్నాయి. గ్యాస్ ట్యూబ్ నుంచి సిలిండర్ భద్రత వరకు, ప్రతి విషయంలోనూ అప్రమత్తంగా ఉండటం అత్యవసరం. మరి ఆ పొరపాట్లేంటి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? మన భద్రతకు ఉన్న భీమా ఏంటి..?
ట్యూబ్ విషయంలో తస్మాత్ జాగ్రత్త : గ్యాస్ ప్రమాదాలకు అత్యంత సాధారణ కారణాల్లో ఒకటి ట్యూబ్ లీకేజీ.
పగుళ్లు, తాళ్లు: గ్యాస్ ట్యూబ్ చివర్లలో పగుళ్లు రావడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. దానికి ఏదో తాడు బిగించి, తాత్కాలికంగా సమస్యను పరిష్కరించామని అనుకుంటాం. కానీ, ఈ చిన్న నిర్లక్ష్యమే పెను ప్రమాదానికి దారితీస్తుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన ‘సురక్ష ట్యూబు’ను వాడితే ఐదేళ్ల వరకు లీకేజీ భయం ఉండదు.
కనిపించని ప్రమాదం: చాలా ఇళ్లలో సిలిండర్‌ను, ట్యూబ్‌ను కప్‌బోర్డులలో దాచేస్తుంటారు. ఇది అత్యంత ప్రమాదకరం. గాలి, వెలుతురు తగలని ప్రదేశంలో ఉంచడం వల్ల ట్యూబ్ పాడైనా, గ్యాస్ లీకైనా గుర్తించడం కష్టం. వంటగది ప్లాట్‌ఫామ్‌కు ఉన్న రంధ్రం గుండా ట్యూబ్‌ను పంపడం మరో పెద్ద పొరపాటు. ఆ రంధ్రం అంచుల రాపిడికి ట్యూబ్ కట్ అయ్యే ప్రమాదం ఉంది.
సిలిండర్, స్టవ్ అమరిక ఇలా ఉండాలి..
ఎత్తు పల్లాలు: ఎల్లప్పుడూ గ్యాస్ స్టవ్.. సిలిండర్ కన్నా ఎత్తులో ఉండేలా చూసుకోవాలి. సిలిండర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పడుకోబెట్టకూడదు.
ఒకటికి రెండు వద్దు: ఒకే సిలిండర్‌కు ‘టీ బెండ్’ వేసి రెండు స్టవ్‌లను వాడటం ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే. అనుసంధానం సరిగా లేకపోతే గ్యాస్ లీకై అగ్నిప్రమాదాలు సంభవిస్తాయి.
సేఫ్టీ క్యాప్ తప్పనిసరి: రెండు సిలిండర్లు ఉన్నవారు, వాడకంలో లేని సిలిండర్‌కు తప్పనిసరిగా సేఫ్టీ క్యాప్ బిగించాలి. ఈ క్యాప్ లేకపోతే, సిలిండర్ నాజిల్‌లో ఉండే ‘ఓ-రింగ్’ను కీటకాలు కొరికే ప్రమాదం ఉంది. దీనివల్ల గ్యాస్ లీక్ అవుతుంది.
ఆధునిక భద్రత.. తెలియని భీమా..
కాంపోజిట్ సిలిండర్లు: ప్రమాదాల నివారణకు ప్రస్తుతం ఫైబర్‌తో చేసిన ‘కాంపోజిట్ సిలిండర్లు’ అందుబాటులోకి వచ్చాయి. ఇవి పారదర్శకంగా ఉండటం వల్ల లోపల ఎంత గ్యాస్ ఉందో చూసుకోవచ్చు. వీటికి పేలుడు భయం, లీకేజీ సమస్యలు ఉండవు.
రూ.5 లక్షల భీమా: ప్రతి గ్యాస్ కనెక్షన్‌పైనా వినియోగదారుడికి పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రీమియంను గ్యాస్ ఏజెన్సీయే చెల్లిస్తుంది. సిలిండర్ లేదా రెగ్యులేటర్ వైఫల్యం వల్ల ఇంట్లో ప్రమాదం జరిగి ఆస్తి లేదా ప్రాణ నష్టం సంభవిస్తే, రాతపూర్వకంగా ఏజెన్సీకి ఫిర్యాదు చేయడం ద్వారా రూ.5 లక్షల వరకు పరిహారం పొందే అవకాశం ఉంది.
అత్యవసరమైతే : గ్యాస్ లీకేజీ లేదా ఇతర ప్రమాదాలు సంభవిస్తే వెంటనే 1906 అనే హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి. ఇతర సమస్యల కోసం 1800 233 3555, 1800 266 6696 టోల్‌ఫ్రీ నంబర్లను సంప్రదించవచ్చు. చిన్నపాటి జాగ్రత్తలతో పెను ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.


