కొల్చారం మండల కేంద్రంలో డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వివోఏలు చేపట్టిన నిరాహార దీక్షలు నేటితో 35వ రోజుకు చేరుకున్నాయి. వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం చెల్లించాలని, వివో ఏలను సెర్ప్ కిందికి తేవాలని, వ్యక్తిగత ఖాతాలలో జీతం వేయాలనే తదితర 18 డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా వివోఏలు నిరాహార దీక్షలు చేపడుతున్నారు. ప్రారంభంలో మండల కేంద్రాల్లోనే దీక్షలు చేపట్టిన వీఏవోలు, ఆ తర్వాత జిల్లావ్యాప్తంగా కలెక్టరేట్ వద్ద నిరవధిక దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వస్తే తాను అమలు చేస్తానని తెలిపారు. దాంతో సిఐటియు మద్దతుతో మండల కేంద్రంలోనే దీక్షలు చేపట్టినట్లు కొల్చారం మండల వివోఏల సంఘం అధ్యక్షుడు అశోక్ తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ డిమాండ్లను నెరవేర్చాలని, లేకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ నిరాహార దీక్షలో గీతా, మంజుల, నర్సింలు, యాదగిరి, లక్ష్మణ్, నాగరాజ్, శంకర్, పద్మా, విజయ, జోసెఫ్ కవిత రేణుక స్వరూప తదితరులు పాల్గొన్నారు.