కొల్లాపూర్, రైతు రుణమాఫీ విడుదల సందర్భంగా డా.బీఆర్. అంబేద్కర్ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా కొల్లాపూర్ మండలం రామాపురం రైతు వేదిక వద్ద రైతులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు సీయం రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని విన్నారు. అనంతరం రుణమాఫీ పొందిన రైతులతో కలిసి హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్నదాతలు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ… ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి .. మొదటి విడతగా రూ. లక్ష లోపు రుణమాఫీకి ఇవాళ శ్రీకారం చుట్టిందన్నారు. రుణమాఫీతో పండగ జరుపుకుంటున్న రైతులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. రైతుల పక్షాన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి, సీయం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీయం భట్టివిక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
వరంగల్ రైతు డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నెరవేర్చారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలోని ప్రజా ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని, ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రుణమాఫీపై కీలక నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ఈ రుణమాఫీతో రైతులు అప్పుల భారం నుంచి బయటపడుతారని చెప్పారు. రుణమాఫీ గత మా బీఆర్ఎస్ ప్రభుత్వానికే సాధ్యం కాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఎలా చేస్తుందనే అతి నమ్మకంతో మాజీ మంత్రి హరీష్ రావు.. ఆగస్ట్ 15 లోగా రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారని గుర్తు చేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి సీయం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేశారన్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం.. మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ లిమిట్ 10 లక్షలకు పెంచడం, గృహ జ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పథకాలను అమలు చేశామని వివరించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.