మేడిగడ్డ బ్యారేజీ లోపాలపై కేసు వేసిన రాజలింగమూర్తి (47) హత్యకు గురికావడం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ హత్యపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ హత్య కేసుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy)మాజీ మంత్రి హరీశ్‌రావు(Harishrao)పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజలింగమూర్తి హత్యను దారి మళ్లించేందుకు హరీశ్‌రావు కృష్ణా నీటి వివాదం గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఓవైపు భర్త దారుణంగా హత్యకు గురై భార్య ఏడుస్తుంటే.. కృష్ణా జలాల వివాదం గురించి మాట్లాడుతారా అని మండిపడ్డారు. అసలు హరీశ్‌రావు మనిషేనా.. మానవత్వం ఉందా అని నిలదీశారు. ఈ హత్య కేసు వెనక మాజీ సీఎం కేసీఆర్ హస్తం ఉందని ఆరోపించారు. కృష్ణా నదీ నీటి దోపిడీకి అసలు కారణం ఎవరు? జగన్‌తో దోస్తానా చేసి శ్రీశైలం, నాగార్జున సాగర్ నీళ్లు దోచి పెట్టింది మీరు కాదా? అని ప్రశ్నించారు. రాజలింగం హత్యపై సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్‌గా ఉన్నారని కోమటిరెడ్డి తెలిపారు. ఈ హత్య వెనక కారకులు ఎవరో దర్యాప్తులో తేలుస్తామని వెల్లడించారు.