గతాన్ని పక్కనపెట్టి జాతీయ రహదారుల నిర్మాణ పనులను పరుగులు పెట్టించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో జాతీయ రహదారులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం పదేండ్లలో జాతీయ రహదారుల నిర్మాణాల గురించి పట్టించుకోకపోవడంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల అభివృద్ధి కుంటుపడి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
అధికారులు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి జాతీయ రహదారుల నిర్మాణాలను ఆపొద్దని.. తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఏ చిన్న సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని అధికారులకు చెప్పారు. రహదారుల నిర్మాణంలో భూసేకరణకు ఉన్న అడ్డంకులపై సీఎంతో, సంబంధిత జిల్లాల కలెక్టర్లతో చర్చించి.. సమస్యను పరిష్కరిస్తానని అధికారులకు చెప్పారు. జాతీయ రహదారులు రాష్ట్ర ప్రగతికి వెన్నముకవంటివని.. వాటి విషయంలో ఎక్కడా అలసత్వానికి తావులేకుండా పనులు చేపట్టాలని సూచించారు. భూసేకరణ, అటవీ అనుమతులు, బన్యన్ ట్రీల తొలగింపు వంటి అంశాలను సీరియస్ గా తీసుకొని పనిచేయాలని సూచించారు. ప్రతీవారం జాతీయ రహదారుల నిర్మాణ పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.