సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkat Reddy) పరామర్శించారు. అనంతరం శ్రీతేజ ఆరోగ్యం పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులకు కోమటిరెడ్డి పలు సూచనలు చేశారు. శ్రీతేజ్ చికిత్సకు ఎంత ఖర్చు అయినా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. అవసరం అయితే అమెరికా నుంచి అత్యాధునిక మందులు తెప్పించి బాలుడిని బతికించాలని సూచించారు. అనంతరం శ్రీ తేజ తండ్రికి రూ. 25 లక్షల చెక్ అందించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. బాలుడిని చూస్తే బాధతో పాటు భయమేస్తుందన్నారు. బాలుడు ఎప్పుడు కోలుకుంటాడో తెలియదన్నారు. ఒకవేళ కోలుకున్నా మునుపటిలా ఉండొచ్చు, ఉండకపోవచ్చని.. మాటలు రావచ్చు, రాకపోవచ్చని వైద్యులు తెలిపారని వాపోయారు. శ్రీ తేజ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నామన్నారు. ఇకపై పుష్ప2 లాంటి సినిమాలు చూడనని తెలిపారు. సందేశాత్మక, దేశభక్తి, తెలంగాణ చరిత్ర సంస్కృతి నేపథ్యంలో తీసే సినిమాలకే రాయితీలు ఇస్తామన్నారు.