తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి జాతర(Komuravelli Mallanna) ఘనంగా ప్రారంభమైంది. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చిన తొలి ఆదివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి మల్లన్నను దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల కోసం ఆలయ పరిసరాల్లో అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజగోపురం పక్కన ప్రత్యేక క్యూలైన్లు, వాటిపై చలువ పందిళ్లు వేయించారు.
సుమారు రెండున్నర నెలల పాటు కొనసాగనున్న ఈ జాతర ఉగాదికి ముందు వచ్చే ఆదివారంతో ముగియనుంది. మల్లన్న ఆలయంలో ప్రతి ఆదివారం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు. భక్తులు బోనాలతో ఆలయానికి వెళ్లి స్వామి, అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. పట్నం వేసి కల్యాణం జరిపించి మొక్కు తీర్చుకుంటారు.