Forest Martyrs Day: అటవీ సంరక్షణలో ఫారెస్ట్ పోలీసులదే కీలకపాత్ర అని, అటవీ అమరవీరులకు తెలంగాణ సర్కార్ ఎల్లవేళలా అండగా ఉంటుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరబాద్ బహుదుర్‌పురలోని నెహ్రూ జూ పార్కులో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్మారక చిహ్నం వద్ద అమరులైన ఫారెస్ట్ అధికారులు, సిబ్బందికి నివాళులర్పించారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడారు.
సిబ్బంది త్యాగాలు వెలకట్టలేనివి
అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచక ముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలర్పించి వీరమరణం పొందిన అటవీ సిబ్బంది త్యాగాలు వెలకట్టలేనివని, వృథా కానివ్వకుండా వారి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తున్నామని కొనియాడారు. విధి నిర్వహణలో అటవీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 1984 నుంచి ఇప్పటివరకు మన రాష్ట్రంలో 22 మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అటవీ సంపదను రక్షించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారని అభినందించారు. అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ప్రతి జిల్లాలో వివిధ రకాల అటవీ కార్యకలాపాలు, ఆయా ప్రాంతాల్లో పనులను ప్రోత్సహించడానికి ప్రతిభావంతులైన ఫ్రంట్‌లైన్ అధికారులకు ఏటా రూ.10 వేల పురస్కారం అందిస్తున్నామన్నారు. అడవి సరిహద్దులు సరిచూసుకొని, పలు చర్యలు తీసుకుంటున్నరన్నారు. కలప అక్రమ రవాణా కట్టడికి సాయుధ పోలీసు దళాల సహకారం తీసుకొని ముందుకు వెళ్తున్నారన్నారు. అటవీ సంరక్షణ బలోపేతానికి రాష్ట్రం ఏర్పడిన తరువాత కొత్తగా 2,181 వాహనాలు ఇచ్చామన్నారు. అడవుల్లో గడ్డి భూములు, నీటి వనరులు అభివృద్ధి చేయడం ద్వారా పంటపొలాలు, పశువులపై వన్యప్రాణుల దాడులు అరికట్టగిలిగామన్నారు.
రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా
క్రూరమృగాల దాడిలో మరణిస్తే గతంలో రూ.5 లక్షలు ఇస్తుండగా.. దానిని రూ.10 లక్షలకు పెంచామని వివరించారు. వనమహోత్సవం ద్వారా రాష్ట్రంలో 307.48 కోట్లకుపైగా మొక్కలను ఇప్పటివరకు నాటామన్నారు. ఇప్పటివరకు 14,355 నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో గ్రామ పంచాయతీల్లో 12,707, మున్సిపాలిటీల్లో 600 ఉన్నాయన్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపొందించడానికి, క్షీణించిన అడవుల్లో అటవీ పునరుద్ధరణ పనులను అన్నీ జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టడం జరుగుతుందన్నారు.
పీడీ యాక్టులో తగిన సవరణలు చేసి.. ఫారెస్ట్ అధికారులపై దాడి చేసే నేరస్తులపై కఠినమైన శిక్షలు పడేలా చేయడానికి తగు చర్యలు తీసుకుంటారన్నారు. పంచాయతీ, పురపాలక చట్టం ద్వారా గ్రామాలు, మున్సిపాలిటీల్లో నాటిన మొక్కలను సంరక్షించడానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా మన అటవీ శాఖ సోదరుల ధైర్య సాహసాన్ని స్ఫూర్తిగా తీసుకొని అటవీ సంపద పరిరక్షణలో పునరంకితమవుదామని ప్రతిజ్ఞ చేద్దామన్నారు.
అమరవీరుల కుటుంబాలకు అండ
పోలీసు విధి నిర్వహణలో చనిపోయిన కుటుంబాలకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో.. అటవీ అమరవీరులకు కూడా అందేలా చూడాలని సీఎస్ రామకృష్ణరావు, పీసీసీఎఫ్ డాక్టర్ సువర్ణకు సూచించారు. ఫారెస్ట్ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా సీఎస్, డీజీపీలు తమ డిపార్ట్‌మెంట్‌కు సహకరిస్తున్నారన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఫారెస్టు ఉద్యోగులకు రాష్ట్ర స్థాయి అవార్డులతో ప్రెసిడెంట్ పోలీస్ మెడల్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని మంత్రి చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, సువర్ణ, ఈలో సింగ్ మేరు, వసంత తదితరులు పాల్గొన్నారు.


