Young Man Died at Kongala Waterfalls: బతుకమ్మ పండుగ పూట విషాదం చోటు చేసుకుంది. ములుగు జిల్లాలో అటవీశాఖ నిషేధిత వాటర్ ఫాల్స్ కొంగల జలపాతం కుంటలో ప్రమాదవశాత్తు పడి యువకుడు మృతి చెందాడు. అటవీశాఖ అధికారుల కళ్లుగప్పి వెళ్లిన సందర్శకులు ఊహించని ప్రమాదంలో చిక్కుకుని ప్రాణం మీదకు తెచ్చుకున్నారు. సెల్ఫీ కోసం ప్రయత్నించిన యువకుడు జలపాతం కుంటలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా అలజడిని సృష్టించింది.
ఈ రోజు నుంచి బతుకమ్మ సంబరాలు మొదలుకానున్నాయి. అందరూ ఆ సంతోషంలో ఉండగా.. జలపాతంలో పడి యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మేడ్చల్ జిల్లాలోని ఉప్పల్ ప్రాంతానికి చెందిన ఎనిమిది మంది యువకులు.. వాజేడు మండలంలోని కొంగాల జలపాతం సందర్శనకు వచ్చారు. భారీ వర్షాల నేపథ్యంలో అటవీశాఖ అధికారుల నిషేధ ఆజ్ఞలు ఉన్న కొంగాల జలపాతం వద్దకు.. సిబ్బందికి తెలియకుండా స్థానికుల సహాయంతో కొంగల జలపాతం వద్దకు వెళ్లి అక్కడ సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో నీళ్ళలో సెల్ఫీ కోసం చేసిన రిస్క్ ఓ యువకుడి ప్రాణాలు బలితీసుకుంది. మహాస్విన్ అనే యువకుడు నీళ్లలో జారి పడి గల్లంతయ్యాడు.
Also Read: https://teluguprabha.net/telangana-news/heavy-rains-forecast-for-telangana-weather-department/
అతన్ని కాపాడేందుకు ప్రయత్నించి ఓ మహిళతో పాటు అభిరామ్, హర్ష అనే మరో ముగ్గురు కూడా నీళ్లలో మునిగిపోయారు. ఈ క్రమంలో వారిని గమనించిన అర్జున్ అనే యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ముగ్గురి ప్రాణాలు కాపాడాడు. కానీ మహాస్విన్ మాత్రం అప్పటికే నీళ్లలో గల్లంతు కావడంతో కాపాడలేకపోయారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/race-for-telangana-new-dgp-cv-anand-vs-b-shivadhar-reddy/
ఈ విషయాన్ని స్థానిక పోలీసులు, అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టి మహాస్విన్ మృతదేహాన్ని వెలికి తీశారు. పోస్టుమార్టం కోసం వెంకటాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి జలపాతాల వద్ద ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో అటవీశాఖ అధికారుల, పోలీసుల నిబంధనలు అతిక్రమించి వెళ్తే వారి పైన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.


