ఆరోగ్య తెలంగాణయే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను రూపొందిస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. యోగ ఎన్నో శతాబ్దాలకు పూర్వం భారతదేశంలో గుర్తింపు పొంది, చివరకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిందని, అందుకే యోగాను భారతదేశానికి పుట్టినిల్లుగా భావిస్తారని ఆయన అన్నారు. యోగా చేయడం వల్ల ఎన్ని రకాలు ప్రయోజనాలు కలుగుతాయని, ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రతిరోజు చేయడం వల్ల గొప్ప ఉపశమనం లభిస్తుందని అన్నారు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా శరీరం యాక్టివ్ గా ఉండడమే కాకుండా ఫిట్ గా తయారవుతుందని అన్నారు. యోగ మానసిక ఆరోగ్యానికి, శరీర దృఢత్వానికి ఎంతో సహాయపడుతుందన్నారు. ముఖ్యంగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు, తరచుగా పొట్ట సమస్యలతో ఇబ్బంది పడేవారు తప్పకుండా యోగాసనాలు వేయాలి. ఇలా చేయడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుందన్నారు.
ఐక్యరాజ్యసమితి ప్రతి సంవత్సరం యోగపై ఒక్కొక్క థీమ్ విడుదల చేస్తుందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన జీవితం కోసం రాష్ట్రంలోని గురుకులం పాఠశాలల్లో పిఈటి టీచర్లతో పాటు యోగ టీచర్లను సైతం సీఎం కేసీఆర్ నియమించారని అన్నారు. కాగా రామగుండం నియోజకవర్గంలో యోగాను విస్తృతపరచడం కోసం నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే చందర్ స్పష్టం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ను యోగ నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో అర్జీ వన్ జిఎం చింతల శ్రీనివాస్, కార్పొరేటర్లు వేణుగోపాల్, భాస్కర్, బాల రాజ్ కుమార్, సుధాజీ, సుజాత, రవీందర్, బిఆర్ఎస్ నాయకులు సంజీవ్, వాసు, శ్యామ్, సిద్దార్థ్ తదితరులు పాల్గొన్నారు.
Korukanti Chander: ఆరోగ్య తెలంగాణయే లక్ష్యం
రామగుండంలో యోగాను విస్తృతం చేద్దాం