తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు, విచ్ఛిన్నకర శక్తులు కులమతాల పేరిట సమాజంలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తాయని, ప్రజలు వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ పిలుపునిచ్చారు. జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17 సందర్భాన్ని సైతం వక్రీకరించి తమ సంకుచిత, స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలని వేసే ఎత్తుగడలను చిత్తు చేయాలన్నారు.
జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ తానిపర్తి భాను ప్రసాద్ రావు, జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి తెలంగాణ తల్లి, జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మంది అమరవీరుల వీరోచిత పోరాటాలతో ప్రజలు స్వేచ్ఛా వాయువులతో జీవిస్తున్నారని అన్నారు. భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని, కులమతాలకు అతీతంగా సోదర సోదరీ భావంతో మెలిగే సంస్కృతి-సంప్రదాయాలకు నిలయమని అన్నారు. కానీ కొంతమంది, ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి కుట్రలు చేస్తున్నారని అన్నారు. వాటిని తిప్పి కొట్టే విధంగా సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కీర్తి, ప్రపంచానికి విస్తృతమైందని అన్నారు. సీఎం కేసీఆర్ తోనే రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందుతోందని ఎమ్మెల్యే చందర్ అన్నారు. గొప్ప పాలనను అందిస్తున్న సీఎం కేసీఆర్ కు మద్దతు పలికి, హ్యాట్రిక్ సీఎంగా గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే చందర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ తో పాటు బిఆర్ఎస్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Korukanti Chander: విచ్ఛిన్నకర శక్తులపట్ల అప్రమత్తంగా ఉండాలి
భిన్నత్వంలో ఏకత్వమే జాతీయ సమైక్యత