నాడు సమైక్య పాలనలో వ్యవసాయం దండగన్న చంద్రబాబు నెడు రైతులకు మూడు గంటల కరెంట్ చాలని మాట్లాడుతున్న పిసిసి ప్రెసిడెంట్ రెవంత్ రెడ్డి చంద్రబాబుకు వారసుడని, రైతు కంటక కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బొంద పెట్టాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రైతులకు పిలుపునిచ్చారు.
బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు సోమవారం అంతర్గాం మండలం సోమనపల్లి రైతు వేదికలో రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులు ట్రాక్టర్లతో ఎమ్మెల్యే కోరుకంటికి ఘన స్వాగతం పలికారు. కోరుకంటి ముందు ట్రాక్టర్ నడుపుతుండగా వెనక ట్రాక్టర్లతో రైతులు రైతువేదిక వరకు ర్యాలీగా బయలు దేరారు. రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ స్వాతంత్రం అనంతరం 60 ఏళ్ల కాలంలో తెలంగాణను పాలించిన పార్టీలుగానీ, నాయకులుగానీ ఎవరు కూడా రైతు సంక్షేమం పట్ల ఆలోచన చేయలేదన్నారు.
నాడు కరెంటు అడిగినందుకు రైతులను కాల్చి చంపించిన చంద్రబాబు వ్యవసాయం దండగన్నాడని, ఆ చంద్రబాబు వారసుడు రేవంత్ రెడ్డి నేడు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అక్కర్లేదు, మూడు గంటలు చాలంటున్నాడని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు లేదు, నీళ్లు లేవు, ఎరువులు లేవని, ఎమ్మార్వో ఆఫీసుల్లో, పోలీస్ స్టేషన్లలో ఎరువులనుంచి అమ్మిస్తే, రైతులు రోజుల తరబడి లైన్లో ఉండి పడిగాపులు కాసిన పరిస్థితిని గుర్తు తెచ్చుకోవాలన్నారు . ఎప్పుడొస్తుందో తెలియని కరెంటు కోసం రైతులు రాత్రులు పొలాల దగ్గర పడుకునే వారని, పాములు, తేలు కాట్లకు, కరెంటు షాక్ కు గురై చనిపోయిన సందర్భాలను చూసామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో 24 గంటల ఉచిత కరెంటుతో రైతులు పంట పొలాల దగ్గర అర్ధరాత్రి పడుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన రైతు కుటుంబం దిక్కులేనిది కాకూడదనే ఉద్దేశంతో 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ను రైతు బీమాగా అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం మాత్రమేనన్నారు. 2018 నుండి ఈ క్లస్టర్ పరిధిలో ప్రమాదవశాత్తు మృతి చెందిన 33 మంది రైతులకు కోటి 65 లక్షల రూపాయలు రైతు బీమాగా అందించామన్నారు. ప్రతి ఎకరాకు నీళ్లు, 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న కెసిఆర్ పాలనలోని బిఆర్ఎస్ ప్రభుత్వమే రైతు సంక్షేమ ప్రభుత్వమన్నారు. 24 గంటల ఉచిత కరెంటు అవసరంలేదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రైతాంగాన్ని అవమాన పరచడమేనన్నారు.
టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి, రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మూడు పంటలు బిఆర్ఎస్ నినాదం.. మూడు గంటల కరెంటు కాంగ్రెస్ విధానమని, కటిక చీకట్ల కాంగ్రెస్ కావాలో! కరెంట్ వెలుగుల బిఆర్ఎస్ కావాలో! తెలంగాణ రైతులు తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 24 గంటల కరెంటునిచ్చే కెసిఆర్ ప్రభుత్వమే మళ్ళీ కావాలని రైతులంతా ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఈ సమావేశంలో జడ్పీటీసీ ఆముల నారాయణ, వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు దివాకర్, మండల కో ఆప్షన్ సభ్యులు గౌస్పషా, సర్పంచ్లు కోల్లురి సత్య సతీష్, ధరని రాజేశ్, దేవమ్మ రాములు, మెరుగు పోశం, బండారి ప్రవీన్, రవీందర్, బాదరవేని స్వామి, ధర్మాజీ కృష్ణ, కోల లత, కోండ్ర చందయ్య, మల్లెత్తుల శ్రీనివాస్, మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తిరుపతి నాయక్, నాయకలు ఎదులపూరం వెంకటేష్, కుర్ర నూకరాజు,గీట్ల శంకర్రెడ్డి, మదన్మోహన్ రావు, కొమురయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.