రామగుండం నియోజకవర్గ ప్రజలందరికి అందుబాటులో ఉండే విధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గోదావరిఖని పోచమ్మ మైదానంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేయబోతున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ నుండి ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రామగుండం నియోజకవర్గ ప్రజలు భూమి, పెళ్ళి, సంస్థ తదితర రిజిస్ట్రేషన్ల కోసం పెద్దపల్లికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని, ఎంతో వ్యయ ప్రయాసలతో అవస్థలు పడేవారన్నారు. అది గమనించి రామగుండం నియోజకవర్గ ప్రజలకు రిజిస్ట్రేషన్ సౌకర్యాలు అందుబాటులో తేవాలనే ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంను మంజూరు చేయించినట్టు తెలిపారు. రాష్ట్ర ల్యాండ్, రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ ను కలిసి రామగుండం మున్సిపల్ ఐడిఎస్ఎంటి షాపింగ్ కాంప్లెక్స్ లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుకు అనుమతులు కోరామని అందుకు మిట్టల్ ఆదేశాలు జారీ చేసారన్నారు. ఆ ఆదేశాలు స్థానిక మున్సిపల్ కమిషనర్ కు అందుతాయని, త్వరలోనే మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లో సబ్ రిజిస్ట్రార్ సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే చందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, నాయకులు బోడ్డు రవీందర్, శంకర్ గౌడ్, మారుతి, మెతుకు దేవరాజ్ పాల్గొన్నారు.