రాష్ట్రంలో రామగుండాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపాలన్నదే నా తపనని, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో, మంత్రి కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ సహకారంతో రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి సాధించామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నియోజకవర్గంలో మెడికల్ కళాశాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు వంటివి సాధించుకున్నామన్నారు. రామగుండం నవనిర్మాణ సభకు హాజరైన మంత్రి కేటీఆర్ ప్రోత్సాహంతో రామగుండంలో ఐటీ పార్క్ ఏర్పాటు చేయాలనే తలంపుతో అమెరికాలో ఐటి పారిశ్రామిక వేత్తలతో భేటీ కావడానికి డల్లాస్ వెళ్లడం జరిగిందన్నారు. తన మూడు రోజుల పర్యటనలో ఎంతోమంది ఐటి శాఖ సంస్థల వ్యవస్థాపకులను, సాంకేతిక నిపుణులైన ప్రవాస భారతీయులను కలవడం జరిగిందన్నారు. వారి సహకారంతో రామగుండం ఎన్నారై డెవలప్మెంట్ ఫోరమ్ ఏర్పాటు చేసి, ఇక్కడి నిరుద్యోగ యువతకు మహిళలకు ఉద్యోగ , ఉపాధి కోసం త్వరలోనే ఈ ప్రాంతంలో ఐటి పార్క్, ఇండస్ట్రియల్ పార్క్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసుకుంటామన్నారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో సాధించుకున్న మెడికల్ కళాశాలలో సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని తాను అసెంబ్లీలో కోరడం జరిగిందన్నారు. తన అభ్యర్థన మేరకు రామగుండం మెడికల్ కళాశాలలో సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లలకు ఏడు సీట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం శుభ పరిణామమన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను మెచ్చి, ఆయన నాయకత్వాన్ని బలపరచడం కోసం కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి ముఖ్య నాయకులు బిఆర్ఎస్ లో చేరుతున్నారన్నారు. అందుకోసం ప్రత్యేకించి చేరికల కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కమిటీలో తానిపర్తి గోపాలరావు, వంగ శ్రీనివాస్ గౌడ్, జెవి రాజు, అడ్డాల రామస్వామి, కోల సంతోష్ సభ్యులుగా ఉంటారన్నారు. అలాగే పార్టీలోనే ఉంటూ పార్టీ పటిష్టతకు భంగం కలిగించే వారిపై, ప్రజల్లో అప్రదిష్ట తెచ్చేవారిపై, పార్టీని బలహీనపరిచే కార్యక్రమాలు నిర్వహించే వారిపై అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కమిటీకి చైర్మన్ గా పిటి స్వామి, సభ్యులుగా తోడేటి శంకర్ గౌడ్, నడిపెల్లి మురళీధర్ రావు, అముల నారాయణ, ఎర్రం స్వామి ఉంటారన్నారు. రామగుండం నియోజకవర్గంలో జరిగిన ప్రగతిని గ్రామ గ్రామాన, ప్రతి డివిజన్ లో, ప్రతి ఇంటికి, ప్రతి పౌరునికి తెలియజేసే విధంగా ఈనెల 13 నుండి రామగుండం దశాబ్ది ప్రగతి ప్రజా చైతన్య పాదయాత్ర నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. అందుకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్ లో ఎంతో అభివృద్ధి జరిగిందని, తాను, తన ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధిని తెలియజేస్తూనే ఇంకా చేయాల్సిన పనులకు భరోసా కల్పించడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపట్ల ప్రజలను చైతన్యపరిచి, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఇతర పార్టీల డిపాజిట్లు గల్లంతయ్యే విధంగా కార్యాచరణ తీసుకుంటామన్నారు. ఈ పాదయాత్రలో గ్రామాల్లో ఉండే ప్రజా ప్రతినిధులు, డివిజన్ కార్పొరేటర్లు, అధికార ప్రతినిధులు, సమన్వయ కమిటీ సభ్యులు, అధ్యక్షులు, ప్రతి కార్యకర్త భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రామగుండం కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పోరేటర్ సాగంటి శంకర్, బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు పి.టి.స్వామి, నడిపెల్లి అమరేందర్ రావు, అడ్డాల రామస్వామి, తిరుపతి నాయక్, పర్లపల్లి రవి, వంగ శ్రీనివాస్, మారుతి, మెతుకు దేవరాజ్, సదయ్య, అమరేందర్, జే.విరాజు, ఎల్లయ్య పిల్లి రమేష్, తోకల రమేష్, నీరటి శ్రీనివాస్, మెహిద్ సన్ని, గుంపుల ఓదేలు, దొమ్మెటి వాసు, సమ్మారావు జిట్టవేన ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.