Sunday, July 7, 2024
HomeతెలంగాణKorutla: వారసులొచ్చారు, గెలుపెవరిదో?

Korutla: వారసులొచ్చారు, గెలుపెవరిదో?

రెండవ తరం వారసుల మధ్య నువ్వా-నేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేడి అన్ని నియోజకవర్గాల్లో తారాస్థాయికి చేరుకుంటోంది. సీనియర్ నేతలు తాము పక్కకు జరిగి, తమ వారసులను బరిలోకి దించే యోచనలో సర్వం ఒడ్డేందుకు సిద్ధమవుతున్న వేళ కోరుట్లలో రాజకీయ కొట్లాట రసకందాయంగా మారుతోంది. నిన్నటి వరకు తండ్రుల మధ్య రాజకీయ పోరుంటే నేడు అది తనయుల పోరుగా మారుతోంది. అంటే రెండో తరం వారు రాజకీయ ఆధిపత్యం కోసం పరస్పరం మాటల దాడికి సై అంటూ కాలుదువ్వుతున్నారన్నమాట. కోరుట్ల కొట్లాటపై తెలుగుప్రభ ప్రత్యేక కథనం..

- Advertisement -

రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు జోరుగా నడుస్తున్నాయి. అన్ని పార్టీల్లో వారసుల రాజకీయ రంగప్రవేశం జరిగింది . కోరుట్ల నియోజకవర్గంలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు వారసులు కావడం విశేషం. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ తరపున ఇక్కడ బరిలోకి దిగేది తమ తండ్రుల రాజకీయ వారసత్వం తీసుకున్న కొడుకులే కావటం విశేషం. భారత రాష్ట్ర సమితి నుండి ప్రస్తుత ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ జెడ్పీ చైర్మన్ కె.వి రాజేశ్వరరావు వారసుడిగా కల్వకుంట్ల సుజిత్ రావు, మాజీ దేవదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తనయుడు జువ్వాడి నరసింగరావు, మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు తనయుడు కొమిరెడ్డి కరంచంద్, బిజెపి నుండి సురభి భూం రావు తనయుడు సురభి నవీన్ కుమార్, బీసీ-ఎస్సీ-ఎస్టీల మద్దతుతో పుదారి నిశాంత్ కార్తికేయలు పోటీ చేసేందుకు సిద్దమయ్యారు.

డా.కల్వకుంట్ల సంజయ్

కోరుట్ల నియోజకవర్గ శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తనయుడుగా కల్వకుంట్ల సంజయ్ కుమార్ రాజకీయ ప్రవేశం చేశారు. వృత్తిరీత్యా డాక్టర్ గా ఎన్నో సేవలందించి రాజకీయ రంగంలో ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో తండ్రి వారసత్వాన్ని తీసుకొని రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. రాబోయే ఎన్నికల్లో తండ్రికి బదులుగా కారు గుర్తుపై పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. ముఖ్యమంత్రి సిట్టింగులకే సీట్లు అని చెప్పినా వయసు రీత్యా తనకు బదులు తన కుమారుడు పోటీలో నిలుస్తున్నట్లు ఎమ్మెల్యే చాలా సందర్భాల్లో నియోజకవర్గ ప్రజలకు ముందుజాగ్రత్తగా వివరిస్తూ, క్యాడర్ ను మానసికంగా సిద్ధంచేశారు. తండ్రి బాటలో నడుస్తూ నియోజకవర్గంని మరింత అభివృద్ధి చేస్తానని సంజయ్ చెబుతున్నారు.

కల్వకుంట్ల సుజిత్ రావు

కరీంనగర్ తొలి జడ్పీ ఛైర్మెన్ దివంగత కల్వకుంట్ల రాజేశ్వర్ రావు వారసుడిగా (రాజేశ్వర్ రావు అన్న కుమారుడు ) కల్వకుంట్ల సుజిత్ రావు ప్రజలకి బాగా చేరువయ్యారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావంలో రాజేశ్వర్ రావుతో పాటు సుజిత్ రావులకు జిల్లాలో తొలి ప్రాధాన్యం ఉండేది. వివిధ కారణాల వల్ల 2009లో కాంగ్రెస్ లోకి వెళ్లి ఇప్పటి వరకు పార్టీలోనే కొనసాగుతూ, పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారు. పార్టీ టికెట్ ఇవ్వకున్నా పార్టీలోనే కొనసాగుతూ, నియోజకవర్గంలో తన సొంత వర్గానికి పెద్ద దిక్కుగా నాయకత్వాన్ని విజయవంతంగా కొనసాగిన్నారు. రాబోయే ఎన్నికల్లో అధిష్టానం టికెట్ తనకే ఇస్తుందని చెబుతూ ప్రజల్లోకి వెళుతున్నారు.

జువ్వాడి నర్సింగ రావు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి దివంగత జువ్వాడి రత్నాకర్ రావు పెద్ద కుమారుడిగా నర్సింగ రావు రాజకీయ రంగప్రవేశం చేశారు. తండ్రి ఆశయలను, ప్రజలకు చేసిన సేవలను కొనసాగిస్తూ ప్రజలల్లోకి వెళుతున్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరిస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేసి, రెండవ స్థానంలో నిలిచి స్థానికంగా తన సత్తా చాటారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ప్రస్తుత ఎమ్మెల్యే పైన ఓటమి చెందారు.. రాబోయే ఎన్నికల్లో అధిష్టానం టికెట్ తనకే ఇస్తుందని, ఈ సారి విజయం తనదేనని ఈయన విశ్వాసంతో ఉన్నారు. ఇందుకు తగ్గట్టుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటూ, క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవుతూ, స్థానికంగా తల్లో నాలుకగా ఎదిగారు.

కొమిరెడ్డి కరంచంద్

మెట్ పల్లి మాజీ శాసనసభ్యులు సుప్రీం కోర్ట్ అడ్వాకెట్ దివంగత కొమిరెడ్డి రాములు పెద్ద తనయుడు కొమిరెడ్డి కరం చంద్.. తన రాజకీయ వారసుడిగా కరం చంద్ ని కొమిరెడ్డి రాములు ప్రకటించారు.. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న కరం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలను కలుస్తూ.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తానే అంటూ ప్రజల్లోకి చురుగ్గా వెళ్తుండగా ప్రజలు కూడా ఈయన్ను బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు.

సురభి నవీన్ కుమార్

ఆల్ ఇండియా లేబర్ కాంట్రాక్టు మాజీ చైర్మన్ భూం రావు కుమారుడిగా నవీన్ కుమార్ రాజకీయ రంగప్రవేశం చేసారు. బీజేపీ పార్టీ తెలంగాణ ఇంచార్జ్ ఆధ్వర్యంలో కోరుట్ల లో భారీ బహిరంగ సభ ద్వారా బీజేపీలోకి నవీన్ కుమార్ జాయిన్ అయ్యారు.. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు, నియోజకవర్గ అభివృద్ధి చేసి తీరతానని ప్రజలకు వాగ్ధానం చేస్తున్నారు.

పుదారి నిశాంత్ కార్తికేయ

ఇబ్రహీంపట్నం మాజీ జెడ్పిటిసి సభ్యురాలు పుదారి అరుణ కుమారుడుగా నిశాంత్ కార్తికేయ రాజకీయరంగ ప్రవేశం చేశారు. అరుణ కుటుంబం మొదటి నుండి బిజెపిలో కొనసాగుతుంది. నిశాంత్ కార్తికేయ బిజెపి బలోపేతం కోసం నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఈయన ఇమేజ్ ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది. కానీ మూడు రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేసారు. బీసీ, ఎస్సీ ఎస్టీల ఐక్యతతో రాబోవు ఎన్నికల్లో బరిలో నిలుస్తున్నట్లు, విద్య, ఉద్యోగం, ఉపాధి తన లక్ష్యమని నిశాంత్ కార్తికేయ తెలిపారు. ఏ పార్టీ తరపున ఈయన బరిలో నిలిచేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.

కాంగ్రెస్, బీజేపీలో వర్గ పోరుతో అభ్యర్థులు సతమతమవుతున్నారు..వర్గ పోరులో నిలిచి, పై చేయి సాధించి, టికెట్ సాధించి, ఎన్నికల బరిలో నిలిచి వారసత్వాన్ని ఎవరు అందుకుంటారో చూడాలి. ఈ సారి ఎవరు శాసనసభలోకి అడుగుపెడుతారన్నది గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠను సృష్టిస్తోంది.

ఇది కోరుట్లలోని అభ్యర్థుల చరిత్ర, ఇదంతా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ వారసుల మధ్య ఈ పోరులో ఎవరు గెలుస్తారని అప్పుడే నియోజకవర్గంలో వాడివేడి చర్చ మొదలైంది. గెలుపోటములపై పందేలా కాసే స్థాయికి కోరుట్ల రాజకీయం చేరిందంటే ఈ వ్యవహారం ఎంత ఆసక్తిగా మారిందో స్పష్టమవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News