Saturday, November 15, 2025
HomeతెలంగాణKTR alleges conspiracy to dry up Kaleshwaram: సీబీఐ ఎంక్వైరీ... కాళేశ్వరాన్ని ఎండబెట్టే కుతంత్రం:...

KTR alleges conspiracy to dry up Kaleshwaram: సీబీఐ ఎంక్వైరీ… కాళేశ్వరాన్ని ఎండబెట్టే కుతంత్రం: కేటీఆర్

KTR Alleges CBI Conspiracy to Dry Up Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ సాకుతో తెలంగాణ అస్తిత్వంపై చంద్రబాబు,మోడీలతో కలిసి రేవంత్ రెడ్డి భారీ కుట్ర పన్నుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు. సీబీఐ విచారణ పేరుతో కేవలం కేసీఆర్, బీఆర్ఎస్ మీదనే దాడి జరగడం లేదన్న కేటీఆర్, తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి, మన గోదావరి జలాలను ఆంధ్రకు తరలించే కుతంత్రాలకు ఆ ముగ్గురు తెరతీశారని విమర్శించారు. తెలంగాణ గొంతుకగా ఉన్న కేసీఆర్, బీఆర్ఎస్‌ను లేకుండా చేసి తెలంగాణపై తిరిగి తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

- Advertisement -

ALSO READ:https://teluguprabha.net/telangana-news/brs-kavitha-ktr-conflict-new-party-2025/

మోడీ, చంద్రబాబు ఎజెండా మేరకు బనకచర్ల ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టారని కేటీఆర్ మండిపడ్డారు. కాళేశ్వరం విచారణను సీబీఐకి అప్పగించడం అంటే ప్రాజెక్టును పూర్తిగా ఎండబెట్టడమే అన్న కేటీఆర్.. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను మోడీ జేబు సంస్థలుగా విమర్శించిన రేవంత్ 48 గంటల్లోనే ఎందుకు మాట మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ వైపు కాంగ్రెస్ అగ్రనాయకత్వం అంతా కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తుంటే రేవంత్ మాత్రం మోడీకి చేరువయ్యేందుకువాటిని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీకి చేదుగా అనిపించిన సిబిఐ, రేవంత్ కు మాత్రం ముద్దొస్తుందా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశాన్ని సిబిఐకి అప్పగించాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కోరగానే సిబిఐకి అప్ప చెప్పడం ఆ రెండు పార్టీల అక్రమ సంబంధానికి సాక్ష్యం అన్నారు.

ALSO READ:https://teluguprabha.net/telangana-news/brs-counter-kavitha-remarks-party-action/

గతంలో ఎస్.ఎల్.బీ.సీ టన్నెల్ కుప్పకూలినప్పుడు, సుంకిశాలలో సైడ్ వాల్ కూలితే, వట్టెం పంప్ హౌజ్ కూలిపోయినా, పెద్దవాగు రెండుసార్లు కొట్టుకుపోయినా కేంద్ర ప్రభుత్వం కనీసం స్పందించలేదని కేటీఆర్ గుర్తుచేశారు. అప్పుడు రాని జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ (ఎన్డీఎస్ఏ) , మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగితే మాత్రం ఆగమేఘాల మీద వచ్చి తలాతోకలోని రిపోర్ట్ ఇచ్చిందని విమర్శించారు.రేవంత్ రెడ్డి మీద ఈగ కూడా వాలకుండా ప్రధాని మోదీ కాపాడుతున్న సంగతిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీని అణచివేసే కుట్రలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుందన్నారు కేటీఆర్. సీబీఐ కే కాదు, ఏ ఏజెన్సీకి కాళేశ్వరం విచారణ అప్పచెప్పినా బీఆర్ఎస్ పార్టీ భయపడదన్నారు. బీజేపీతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న ఈ కుట్రలను ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. న్యాయస్థానాల పైన తమకు సంపూర్ణ నమ్మకం ఉందని కేటీఆర్ పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad