Harish rao house arrest: ఆర్టీసీ సిటీ బస్సు ఛార్జీల పెంపుపై నిరసన వ్యక్తం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ‘చలో బస్ భవన్’ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. బీఆర్ఎస్ పిలుపు నేపథ్యంలో నగరంలోని బస్ స్టాప్‌ల వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో ముఖ్య నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అయినప్పటికీ భారీగా బీఆర్ఎస్ శ్రేణులు బస్ భవన్ వద్దకు చేరుకున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మెహిదీపట్నం నుంచి బస్ భవన్‌కు ఆర్టీసీ బస్సులో చేరుకున్నారు. కేటీఆర్ సైతం బస్ భవన్ వద్దకు వచ్చారు. అనంతరం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు నగర ప్రజల తరపున వినతిపత్రం సమర్పించనున్నారు.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత: ఆర్టీసీ ఛార్జీల పెంపునకు నిరసనగా గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి బస్ భవన్‌కు చేరుకోవాలని పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
నిర్బంధాలు మాకు కొత్త కాదు: తనతో పాటు ఇతర నేతల గృహ నిర్బంధంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం ఇవ్వాలని తమ పార్టీ పిలుపునిచ్చిందని తెలిపారు. ఛార్జీల పెంపును వెనక్కి తీసుకోవాలని ఆయన్ను కోరనున్నట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులు ఎక్కి వెళ్తామంటే భారీగా పోలీసులను మోహరించడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఒక వ్యక్తిని బస్సు ఎక్కకుండా ఆపడానికి ఇంత మంది పోలీసులను పంపారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉత్సాహం హైదరాబాద్‌లో నేరాల అదుపులో చూపిస్తే మంచిదని అన్నారు. బస్సు ఛార్జీల పెంపును వెనక్కి తీసుకునే వరకు పోరాడుతూనే ఉంటామని కేటీఆర్ తెలిపారు. పోలీసు నిర్బంధాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదన్నారు.
Also read: https://teluguprabha.net/telangana-news/former-minister-harish-rao-house-arrest-in-kokapet/
శాంతి భద్రతల నేపథ్యంలో అరెస్టులు: చలో బస్‌భవన్ కార్యక్రమంలో భాగంగా.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటుగా మాజీ మంత్రులు హరీశ్ రావు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉదయం 9 గంటలకు రేతిఫైల్ బస్టాండ్‌కు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్‌భవన్ వరకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. అనంతరం ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు నగర ప్రజల తరపున వినతిపత్రం సమర్పించాలనుకున్నారు. కానీ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.


