Tuesday, November 5, 2024
HomeతెలంగాణKTR: తెలంగాణలో నిత్యం అరెస్టుల పర్వమే.. సర్పంచ్‌ల అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం

KTR: తెలంగాణలో నిత్యం అరెస్టుల పర్వమే.. సర్పంచ్‌ల అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం

KTR| పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని నిరసన చేస్తున్న మాజీ సర్పంచ్‌లను అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రులు కేటీఆర్(KTR), హరీష్‌రావు(Harishrao) తీవ్రంగా ఖండించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్టులు పెట్టారు.

- Advertisement -

“పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఏడాది నుంచీ అడుగుతున్నా ఇవ్వకుండా.. మాజీ సర్పంచులను ఇలా అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. రాష్ట్రంలో నిత్యం అరెస్టుల పర్వమే కొనసాగుతోందని, ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి సమస్యల్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తోంది. సీఎం, మంత్రులు రాష్ట్రంలో ఉన్న సమస్యల్ని పట్టించుకోకుండా ఊరేగుతున్నారు. సర్పంచుల కుటుంబాలు రోడ్డున పడేంతవరకూ ప్రభుత్వం స్పందించదా ? సర్పంచులు శాంతియుతంగా నిరసనకు పిలుపునిచ్చినా ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు. తమ హయాంలో పల్లె ప్రగతి పేరున చేపట్టిన కార్యక్రమానికి.. ఈ ప్రభుత్వం తూట్లు పొడిచి నిధులు విడుదల చేయకుండా ఆపుతోంది. పోలీసులు అరెస్ట్ చేసిన సర్పంచుల్ని వెంటనే విడుదల చేయాలి” అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఇక హరీష్‌రావు స్పందిస్తూ “పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని కోరుతూ పోరుబాటకు పిలుపునిచ్చిన మాజీ సర్పంచ్‌లను రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని హైదరాబాద్ కు వస్తే వారిని అడ్డుకోవడం, అక్రమంగా నిర్బంధించడం అప్రజాస్వామికం. అప్పులు తెచ్చి, ఆస్తులు అమ్మి, భార్యా పిల్లల మీద ఉన్న బంగారం కుదువ పెట్టి గ్రామ అభివృద్ధి కోసం చేసిన డబ్బులు ఇవ్వాలంటే ప్రభుత్వం అరెస్టులు చేస్తుంది. ప్రజాపాలన అంటే ఊరికి సేవ చేసిన సర్పంచులను అరెస్టులు చేయడమేనా? బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తూ, చిన్న పనులు చేసిన మాజీ సర్పంచులకు మాత్రం బిల్లులు చెల్లించకపోవడంలో ఆంతర్యం ఏమిటి? అక్రమంగా నిర్బంధించిన, అరెస్టులు చేసిన మాజీ సర్పంచులు వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బిల్లులను తక్షణం చెల్లించాలని బి ఆర్ ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం” అని హెచ్చరించారు.

కాగా గత పదేళ్లుగా గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన బిల్లులను క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచ్‌లు పోరుబాటకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వాలని ఆదివారం రాత్రి అందరూ నగరానికి చేరుకున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో వారంతా సమావేశమవ్వగా పోలీసులు అక్కడికి చేరుకుని కొందరిని నిర్బంధించారు. మరికొందరిని అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News