రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) అట్టర్ ఫ్లాప్ అయ్యారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు పెద్దపెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసుకున్నా పావులా వంతు కూడా రుణమాఫీ కాలేదని ఆరోపించారు.
కాంగ్రెస్ హామీలపై ఇప్పుడు గ్రామ సభల్లో జనం నిలదీస్తుంటే పాలకుల దగ్గర సమాధానం లేదని ఎద్దేవా చేశారు. కేసీఆర్ రూ.10వేలే ఇస్తున్నారని.. తాను అయితే రూ.15వేలు ఇస్తా అని రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తు చేశారు. మరి రూ.15వేలు ఇవ్వకుండా ఇప్పుడు రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. మోసం చేయడమే గాక మళ్లీ చారిత్రాత్మక నిర్ణయం అంటున్నారని ధ్వజమెత్తారు. రేషన్ కార్డు కావాలంటే దరఖాస్తు.. రైతు భరోసా అంటే దరఖాస్తు.. కులగణన అంటే దరఖాస్తు.. పెట్టిన దరఖాస్తులే పెట్టి ప్రజలు విసిగిపోతున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.