BC Reservations: బీసీల రిజర్వేషన్ల విషయంలో తెలంగాణలో రాజకీయ దుమారం రాజుకుంది. బీసీ-ఐకాస ఆధ్వర్యంలో ఈ నెల 18న తలపెట్టిన ‘బంద్ ఫర్ జస్టిస్’ రాష్ట్ర బంద్‌కు భారత రాష్ట్ర సమితి (BRS) నైతిక మద్దతు ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో ఆర్.కృష్ణయ్య, బీసీ ఐకాస ప్రతినిధులతో ఆయన భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. బీసీ రిజర్వేషన్ల అంశంలో కాంగ్రెస్ వైఖరిని తీవ్రంగా విమర్శించిన కేటీఆర్, ‘‘బీసీల విషయంలో కాంగ్రెస్‌ది చిత్తశుద్ధి లేని శివపూజ’’ అని ధ్వజమెత్తారు. బీసీలకు న్యాయం జరగాలంటే కేవలం అసెంబ్లీలో బిల్లు చేయడం సరిపోదని, దీనికి పార్లమెంటులో బిల్లు చేయడమే సరైన మార్గమని ఆయన ఉద్ఘాటించారు. అసెంబ్లీలో చేసి, ఆ నెపాన్ని ఇతరులపై నెట్టడం సమంజసం కాదన్నారు.
బీసీల సంక్షేమంపై తమ ప్రభుత్వ నిబద్ధతను గుర్తు చేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేశారని కేటీఆర్ తెలిపారు. కేవలం రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే కాదని, విద్య, ఉద్యోగాలు, అన్ని రంగాల్లో అన్ని రకాలుగా మేలు జరగాలన్నదే బీఆర్‌ఎస్ విధానమని స్పష్టం చేశారు.
అలాగే, ఈ ధర్నాకు మద్దతు ఇస్తున్నామని చెబుతున్న బీజేపీపైనా ఆయన పదునైన విమర్శలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీనే పార్లమెంటులో బిల్లు పెడితే ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది కదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధన తరహాలోనే బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని కూడా ఢిల్లీ దాకా తీసుకువెళ్లి, పార్లమెంటులో చట్ట సవరణ ద్వారా సాధించుకోవాలని బీసీ ఐకాస నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ ముఖ్యమైన అంశంపై కాంగ్రెస్, బీజేపీ చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన డిమాండ్ చేశారు.


