KTR : తెలంగాణలో ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం శేరిలింగంపల్లిలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రండి అంటూ కాంగ్రెస్ పార్టీకి, ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బహిరంగ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పి ఎన్నికల్లో గెలిచి చూపించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ, ఇప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే రాజీనామా చేయడానికి భయపడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కాంగ్రెస్ ‘హైడ్రా’ వ్యవస్థ బ్లాక్‌మెయిల్ దందాలతో కుప్పకూల్చిందని ఆయన ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పు కంటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 20 నెలల్లోనే ఎక్కువ అప్పులు చేసిందని కేటీఆర్ విమర్శించారు. అభివృద్ధి గురించి మాట్లాడే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు.
బీఆర్ఎస్ పాలనపై కేటీఆర్ ప్రశంసలు
గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ ఎలా అభివృద్ధి చెందిందో కేటీఆర్ గుర్తు చేశారు. 2014లో కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, కేసీఆర్ నాయకత్వంలో ఆరు నెలల్లోనే విద్యుత్ సమస్యను పరిష్కరించి, ఇన్వర్టర్లు, జనరేటర్లు అవసరం లేకుండా చేశామన్నారు. కులం, మతం, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలు కలిసి జీవించేలా అభివృద్ధి చేశామని చెప్పారు. అందుకే 2023 ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని కేటీఆర్ పేర్కొన్నారు.
స్వార్థ ప్రయోజనాల కోసమే ఫిరాయింపులు
పార్టీ మారిన నాయకులు ప్రజల కోసం కాదని, కేవలం తమ స్వార్థ ప్రయోజనాలు, ఆర్థిక లాభాల కోసమే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు నిజంగా మేలు చేసి ఉంటే, ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి చూపించాలని మరోసారి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమపై కేసులు పెడతామని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, కానీ పార్టీ కార్యకర్తలు తమ జెండాను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటున్నారని ప్రశంసించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.


