దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy)కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మరోసారి ఛాలెంజ్ చేశారు. కొడంగల్‌లో ఉప ఎన్నిక జరిగితే తమ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు మహాధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి బంపర్ ఆఫర్ ఇస్తున్నానని తెలిపారు.
“కులగణన చేశా, బీసీలందరూ సంతోషంగా ఉన్నారు, రైతు బంధు వేశా రైతులంతా సంతోషంగా ఉన్నారు, రైతు కూలీలకు పైసలు వేశా వాళ్లు సంతోషంగా ఉన్నారు, ఇళ్ల కాగితాలు ఇచ్చా పేదలంతా సంతోషంగా ఉన్నారని మీరు అంటున్నారు కదా.. దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ ఇక్కడికి రండి. ఎవరు గెలుస్తారో చూద్దాం.” అని సవాల్ విసిరారు. 50వేల మెజార్టీకి ఒక్క ఓటు తక్కువ వచ్చినా రాజకీయ సన్యాసం చేస్తానని ఛాలెంజ్ చేశారు. తెలంగాణలో ఏడాదిగా కౌరవ పాలన నడుస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు, మహిళలు, వృద్ధులు, యువతకు చేసిందేమీ లేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు.