Saturday, November 15, 2025
HomeతెలంగాణKTR Comments: కేసీఆర్‌ విజన్‌తోనే మైనార్టీ గురుకులాల ఏర్పాటు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

KTR Comments: కేసీఆర్‌ విజన్‌తోనే మైనార్టీ గురుకులాల ఏర్పాటు.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

KTR Comments on Minority Residential Schools: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మైనార్టీ గురుకులాల విషయంలో గతంలో కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు కురిపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో 100 గురుకుల పాఠశాలలను కేవలం ముస్లిం అమ్మాయిల కోసమే ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ ఘనత మాజీ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ముస్లిం అమ్మాయిలు చదువుకోరని, వారి తల్లిదండ్రులు చదువు పట్ల ప్రోత్సహించరని, వారికి ఇన్ని గురుకులాలు అవసరం లేదని అధికారులు చెప్పినప్పటికీ.. రాష్ట్ర వ్యాప్తంగా 204 మైనార్టీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు. అందులో 100 పాఠశాలలు అమ్మాయిల కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ పాఠశాలల్లో ఇప్పుడు వందలాది మంది ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు మతాలకు చెందిన విద్యార్ధులు చదువుతున్నారని గుర్తు చేశారు. వీరంతా ఉన్నత చదువులు చదువుకొని, గొప్ప స్థానాలను చేరుకుంటున్నారంటే అది కేసీఆర్‌ విజన్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు దూసుకెళ్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. మాగంటి గోపీనాథ్‌ ఆకస్మిక మరణంతో వచ్చిన ఈ ఉప ఎన్నకల్లో గెలిచి సిట్టింగ్‌ స్థానాన్ని నిలుపుకోవాలని అన్ని ప్రయత్నాలు చేస్తోంది. బీఆర్‌ఎస్‌ తరఫున మాగంటి గోపీనాథ్‌ సతీమణి సునితను బరిలోకి దింపింది బీఆర్‌ఎస్‌ పార్టీ. ఈ ఎన్నికలో గెలుపును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రచారశైలిపై ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారు. అందుకోసం వార్ రూంను సైతం ఏర్పాటు చేశారు. ఏ డివిజన్ లో ప్రచారంలో వెనుకబడ్డాం.. ఎలా ముందుకు వెళ్లాలి.. ప్రజలను ఎలా ఆకట్టుకోవాలనేదానిపై ఎప్పటికప్పుడు క్షేత్రస్ధాయిలో నేతలకు సూచనలు చేస్తున్నారు.

- Advertisement -

షేక్‌పేట్‌ డివిజన్‌లో కేటీఆర్‌ ప్రచారం..

ఆదివారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం సందర్బంగా మాజీ మంత్రులు కేటీఆర్‌, ప్రశాంత్ రెడ్డి షేక్‌పేట డివిజన్ పర్యటించారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ..”2014 నుంచి పదేళ్లలో హైదరాబాదును ఎంతో అభివృద్ధి చేశాం. 2014 కంటే ముందు ప్రతి అపార్ట్‌మెంట్ ముందు జనరేటర్లు ఉండేవి. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం ద్వారా జనరేటర్లు మాయమయ్యాయి. విభిన్న సంస్కృతులకు నెలవైన హైదరాబాద్లో మా హయాంలో ఎప్పుడూ మతకల్లోలాలు జరగలేదు. పదేళ్ల పాలనలో అందరూ ప్రశాంతంగా జీవించారు. బతుకమ్మ చీరలు, రంజాన్ తోఫాలు, క్రిస్టమస్ గిఫ్టులు అందించాం. కేసీఆర్‌ అన్ని మతాలను గౌరవించారు. కొత్త సచివాలయం నిర్మించినప్పుడు అక్కడ ఒక మజీద్, ఒక చర్చి, ఒక దేవాలయం నిర్మించారు. కేసీఆర్ సెక్యులర్ లీడర్ అనే దానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలో వారే చెప్పాలి. ఏం చేశారని వారికి ఓటేయాలి? బీజేపీతో బీ టీమ్ అని మాపై నిందలు వేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లు నడిస్తే వ్యతిరేకించే రాహుల్ గాంధీ హైదరాబాదులో బుల్డోజర్లను ఎందుకు వ్యతిరేకించడం లేదు? కేంద్రంలో సీబీఐ బీజేపీ తొత్తు అని రాహుల్ గాంధీ ఆరోపిస్తారు. ఇక్కడి కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం ప్రాజెక్టును ఎంక్వయిరీ చేయమని సీబీఐకి అప్పగిస్తుంది. ఇదేం వైఖరి?. వక్ఫ్ బిల్లును తెలంగాణలో అమలు చేస్తూ కాంగ్రెస్ జీవో తెచ్చింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వక్ఫ్ బిల్లును అమలు చేసేందుకు తొందర పడలేదు. కానీ, ఇక్కడ మాత్రం వెంటనే అమలు చేశారు. ఇక్కడ ఒక మంత్రిపై ఈడీ దాడులు జరిగి ఏడాదైనా ఎలాంటి చర్యలు లేవు. ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ రూ. 1350 కోట్ల రూపాయలతో కాంట్రాక్టు ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లయినా ఇప్పటికీ ఒక్క ముస్లిం వ్యక్తికి ప్రాతినిధ్యం లేదు. ముఖ్యమంత్రి అనుకుంటే ఒక ఎమ్మెల్సీ సీటు ముస్లింలకు కేటాయించి మంత్రి పదవి ఇవ్వచ్చు. కానీ ఎందుకు చేయడం లేదు?” అంటూ నిలదీశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad