ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నివేదికను ఎన్డీయే నివేదిక అనడంలో తప్పు లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండగొట్టి, 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆరోపించారు.
“మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎఎస్ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయింది. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పులతడక అని రుజువైపోయింది
క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టు లాంటిదే. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికను మొదలుకుని, ఏడాదిన్నర దాకా సాగదీసి ఇటీవల ఇచ్చిన తుది నివేదిక వరకూ రెండింటిలోనూ అడుగడుగునా వ్యత్యాసాలు, పొంతనలేని అంశాలుండటం రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టింది
ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనం. కేసీఆర్ గారికి పేరొస్తుందనే రాజకీయ కక్షతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను పక్కనపెట్టి సీఎం రేవంత్ క్షమించరాని పాపం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండగొట్టి, 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు కారణమయ్యారు.
ఎన్డీఎస్ఏ వాదనలన్నీ తప్పుల తడక అని తేలిపోయిన నేపథ్యంలో.. దీన్ని కుంటిసాకుగా చూపి దాటవేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇకనైనా పోలవరం తరహాలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలి. లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి ముఖ్యమంత్రితోపాటు కాంగ్రెస్-బీజేపీల కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.” అని పేర్కొన్నారు.