వికారాబాద్ జిల్లాలోని తాండూరు ఆస్పత్రి పేరును సోమవారం రాత్రి కొడంగల్ జనరల్ హాస్పిటల్‌గా పేరు మార్చుతూ కొత్తగా ఫ్లెక్సీ ఏర్పాటైంది. ఉన్నట్లుండి పేరు మార్చుతూ ఫ్లెక్సీ కట్టడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే గుత్తేదారు దురుసుగా మాట్లాడటంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరుకుని ఫ్లెక్సీని చించేశారు.ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై మండిపడ్డారు.
“రేవంత్ నేమ్ ఛేంజర్ మాత్రమేనా? అధికారంలోకి రాగానే స్వంత నియోజకవర్గం కొడంగల్‌కు ఆదరాబాదరాగా మెడికల్ కాలేజీ సాంక్షన్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి. కానీ దానికి మెడికల్ కౌన్సిల్ అనుమతులు రావాలంటే అనుబంధంగా ఒక పెద్ద ఆసుపత్రి ఉండాలనేది మాత్రం మనోడికి తెలవదు. రేపు మెడికల్ కౌన్సిల్ వాళ్లు తనిఖీలకు వస్తారనగా రాత్రికి రాత్రి తాండూరు జిల్లా ఆసుపత్రి బోర్డు మార్చేసి కొడంగల్ ఆసుపత్రి అని పెట్టేశాడు. ఏదీ కొత్తగా కట్టడం శాతగాదు. పేర్లు మార్చడం మాత్రమే తనకు తెలిసిన విద్య. నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అన్నట్టుంది ఈయన వ్యవహారం. ఈ అతితెలివితోనే తెలంగాణను ఆగం బట్టిస్తున్నాడు రేవంత్” అని కొంతం దిలీప్ చేసిన ట్వీట్‌ను కేటీఆర్ రీట్వీట్ చేశారు.
కాగా గత ప్రభుత్వంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి సొంత నియోజవర్గం కొడంగల్‌కు మార్చుకున్న సంగతి తెలిసిందే. దీనికి అనుబంధంగా 220 పడకల ఆసుపత్రిని చూపించాల్సి ఉండగా ఢిల్లీ నుంచి జాతీయ వైద్య కమిషన్(NMC) బృందం కొడంగల్‌కు తనిఖీ నిమిత్తం రానున్నట్లు సమాచారం. దీంతో తాండూరులోని 200 పడకల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పేరును కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా మారుస్తూ సోమవారం రాత్రి ఫ్లెక్సీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.