KTR| దశాబ్దాల పాటు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి రాబందులా మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన నిందితులతో సంగారెడ్డి సెంట్రల్ జైలులో ములాఖత్ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ జైలులో ఉన్న రైతులను థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ సంఘటనతో సంబంధం లేని వాళ్లను కూడా జైల్లో పెట్టారని మండిపడ్డారు.
గతంలో ఫార్మా కంపెనీలను విమర్శించిన రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ఇప్పుడు మాత్రం అదే ఫార్మా కంపెనీల కోఒసం వేల ఎకరాలు లాక్కుంటున్నారని పేర్కొన్నారు. తమ భూములు ఇవ్వమని రైతులు చేసిన ఆందోళనల్లో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారన్నారు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలను మాత్రమే అరెస్ట్ చేశారని ఫైర్ అయ్యారు. కావాలంటే తమను అరెస్ట్ చేసుకోవాలని.. రైతులు వదిలేయండని విజ్ఞప్తి చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి పదవి ఐదు సంవత్సరాలు మాత్రమే అని గుర్తు పెట్టుకోవాలని.. ఢిల్లీ పెద్దలకు కోపం వస్తే రేపో మాపో పదవి పోతుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు. సీఎం అన్న తిరుపతిరెడ్డి రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కొడంగల్‌ను అల్లుడి ఫార్మా కంపెనీకి రాసివ్వాలని తిరుపతి రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇవాళ కొడంగల్ తిరగబడిందని.. రేపు తెలంగాణ తిరగబడుతుందని హెచ్చరించారు. తాము అధికారంలోకి వచ్చాక ఏం చేయాలో తమకు తెలుసన్నారు. పేదవాడి కన్నీళ్ల ఉసురు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగులుతుందని కేటీఆర్ వెల్లడించారు.