KTR Fires on Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ ప్రజల సొమ్ముతో నాడు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి.. నేడు కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా కేసును సీబీఐకి అప్పగించారని మండిపడ్డారు. సీబీఐ బీజేపీ జేబు సంస్థగా మారిందని పదేపదే విమర్శించే రాహుల్ గాంధీ.. కాళేశ్వరంపై విచారణను సీబీఐకి అప్పగించేందుకు ఎలా అంగీకరించారని సూటిగా ప్రశ్నించారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ ఎంత విష ప్రచారం చేసినప్పటికీ.. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుకు చివరకు కాళేశ్వరమే దిక్కైందని ఎద్దేవా చేశారు. మల్లన్నసాగర్ వద్ద శంకుస్థాపన చేస్తే కాళేశ్వరం పేరు చెప్పాల్సి వస్తుందని గండిపేట వద్ద సీఎం శుంకుస్థాపన చేయబోతున్నారని విమర్శించారు. పత్రికల్లో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ప్రారంభోత్సవంపై గొప్పగా ప్రకటనలు చేశారని, కాళేశ్వరం కూళేశ్వరం అని మాట్లాడిన వారే ఇప్పుడు అదే కాళేశ్వరం నీళ్లు తెచ్చి హైదరాబాద్ ప్రజలుక నీళ్ళు ఇస్తామని అంటున్నారంటే తెలంగాణకు కాళేశ్వరం కల్పతరువు అని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకున్నట్లేనా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. గండిపేటకు తీసుకువస్తున్నవి కాళేశ్వరం నీళ్లా? కాదా? అనే ప్రశ్నకు సీఎం సమాధానం చెప్పాలన్నారు.
ప్రజలను ఎక్కువ కాలం మోసం చేయలేరు..
కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేసినందుకు గానూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఓవైపు కాళేశ్వరం నీళ్లతో వచ్చే కీర్తి కోసం ప్రాకులాడుతూనే.. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తీరు తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా ఉందని ఎద్దేవా విమర్శించారు. కాళేశ్వరానికి గుండెకాయ వంటి మల్లన్న సాగర్‌ను వదిలి గండిపేట వద్ద శంకుస్థాపన చేస్తున్నారంటే ప్రజలను మోసం చేస్తున్నట్లేనని, ఎక్కువ కాలం ప్రజలను మోసం చేయలేరని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కాళేశ్వరంలో లక్ష కోట్ల రూపాయల అవినీతి అంటూ అసత్య ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరంలో అవినీతి జరగలేదని స్వయానా సీఎం రేవంత్ రెడ్డి మామ పద్మారెడ్డి చెప్పారని గుర్తు చేశారు. 94 వేల కోట్లు ఖర్చైన ప్రాజెక్టులో ఓ వైపు నీళ్లు కనిపిస్తుంటే.. లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందంటూ ఆయన కొట్టిపారేసినా సీఎం బుద్ధి మారడం లేదని కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజీలో ఒక్క బ్లాక్ కోసం రూ. 250 నుంచి 300 కోట్ల మేర ఖర్చు అయిందని, ఎన్డీఎస్ ఏ రిపోర్టు ప్రకారం మేడిగడ్డలో 7వ బ్లాక్ ఒక్కటే రిపేర్ చేస్తే సరిపోతుందని చెప్పారు. మేడిగడ్డలోని ఏడవ బ్లాక్‌ను పునర్నిర్మిస్తామని ఏజెన్సీనే ముందుకు వస్తే ప్రజల సొమ్ము ఎక్కడ వృథా అయిందో చెప్పాలన్నారు. కాళేశ్వరంలో ఒక్క రూపాయి కూడా వృథా కాలేదన్నారు. ఓ వైపు గోదావరి నీళ్లను వాడుకుంటూ మరో వైపు చిల్లర ప్రచారం చేస్తున్నందుకు సీఎం ముక్కు నేలకు రాసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.


