Saturday, November 23, 2024
HomeతెలంగాణKTR: గౌరవెల్లి కరవును తరిమేసే కల్పవల్లి

KTR: గౌరవెల్లి కరవును తరిమేసే కల్పవల్లి

హుస్నాబాద్ మెట్ట ప్రాంతం.. కరవుతో అల్లాడిన ప్రాంతం.. దుర్భిక్ష ప్రాంతం.. నెత్తురు వారిన భూమి.. నెర్రెలు వారిన నేల అని, గోదావరి జలాలు తెస్తా.. లక్ష ఎకరాలకు నీళ్లిస్తా.. అని సి ఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నారని అపర భగీరథుడు కేసీఆర్ అని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కేటీఆర్ శంఖుస్థాపన, ప్రారంభోత్సవం చేసారు. అనంతరం హుస్నాబాద్ పట్టణంలోని బస్ డిపో పక్కన ఉన్న మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సభకు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, ఎమ్మెల్సీ రమణ హాజరయ్యారు. మన నెత్తిమీదే ఉంది గౌరవెల్లి…. హుస్నాబాద్ ప్రాంత కరవును తరిమేసే కల్పవల్లి… ఈ ప్రాజెక్టు ద్వారా హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు శాశ్వతంగా కరవు నుండి విముక్తి కలుగుతుంది. సముద్ర మట్టానికి 82 మీటర్ల ఎత్తులో కాళేశ్వరం ఉందని, ఎక్కడ కాళేశ్వరం… ఎక్కడ హైదరాబాద్.. కాళేశ్వరం గోదావరి జలాలను ఒక్కొక్క లిఫ్ట్ ద్వారా 618 మీటర్ల ఎత్తున ఉన్న హైదరాబాద్ కు కేసీఆర్ తీసుకువచ్చారని కేటీఆర్ అన్నారు. కొండ పోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, మిడ్ మానేరు, రాజరాజేశ్వర డ్యామ్, తోటపల్లి, గౌరవెల్లి వంటి ఎన్నో ప్రాజెక్టులకు నాలుగేళ్లలోనే పూర్తి చేసి నీళ్లు అందించిన ఘనత సి ఎం కేసీఆర్ దని అన్నారు. గతంలో ఒక ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొడితే.. ఇది పూర్తవుతుందా? లేదా? అనే అనుమానం ఉండేదని, ఎప్పుడో నెహ్రు కాలంలో పునాది రాయి వేస్తె.. ఆ ప్రాజెక్టులు ఇంకా కడుతూనే ఉన్నారని, కాలువలు తవ్వుతూనే ఉన్నారని అయన అన్నారు. గత ప్రభుత్వాలు పునాది రాళ్లు వేసినప్పటికీ రైతులకు నీళ్లు మాత్రం రాలేదని, కానీ కేసీఆర్ మాత్రం తాను శంఖుస్థాపన చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎంతమంది అడ్డుపడినా నాలుగేళ్లలో పూర్తి చేసి గోదావరి జలాలతో మెట్ట ప్రాంత రైతుల పదాలు కడిగి చూపించారని కేటీఆర్ ఉద్వేగంగా అన్నారు. 2014 కు ముందు గ్రామంలో ఎవరైనా పెద్దమనిషి చనిపోయే.. ఒక అరగంట కరెంటు ఇవ్వమని బ్రతిమిలాడుకునేవారని, కాంగ్రెస్ హయాంలో ఆరుగంటలు కూడా సక్రమంగా కరెంటు సరఫరా చేయలేదని. ఆనాడు కరెంటు ఉంటె వార్త, నేడు కరెంటు పొతే వార్త ! అని కేటీఆర్ తెలిపారు. హుస్నాబాద్ లో ఎల్లమ్మ చెరువు వద్ద గిరిజన మహిళలను కలిసానని,నల్లా నీళ్లు వస్తున్నాయా? అని అడిగితే “బంజారాహిల్స్ లో నీళ్లు ఎలావస్తున్నాయో.. మా బంజారా తండాల్లోని అలాగే నీళ్లు వస్తున్నాయి.. నీళ్ల గోస పోయింద”ని చెప్పారని కేటీఆర్ చెప్పారు. పది జిల్లాల తెలంగాణ 33 జిల్లాలు అయిందని, సతీష్ కుమార్ కృషితో హుస్నాబాద్ రెవిన్యూ డివిజన్ అయిందని అక్కన్నపేట కొత్త మండలం అయిందని, ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గంలో 11 తండాలు గ్రామపంచాయతీలుగా ఏర్పాటయ్యాయని వివరించారు. ఎండాకాలంలో గ్రామాలకు తండాలకు రావడానికి ప్రజప్రతినిధులు భయపడేవారని, నీళ్లు అడుగుతారని, పైప్ లైన్లు వేయమంటారని, బోర్లు అడుగుతారని ముఖం చాటేసేవారుని, కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత మా ఎంపిపిలు, జెడ్పిటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు కాలర్ ఎగరేసి తిరుగుతున్నారని కేటీఆర్ అన్నారు. 70 ఏళ్లలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు చేయని విధంగా సీఎం గ్రామాలకు నీళ్లు ఇచ్చారని, గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్న ఈ ఆలోచన రాలేదని, మహిళల కష్టాలు కేసీఆర్ తీర్చారని, దేశంలో మొదటిసారి ఇంటింటికి నీళ్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని, ఇది మన అందరికీ గర్వకారణం అని కేటీఆర్ అన్నారు. గతంలో “నేను రాను బిడ్డ సర్కారు దావఖానకు” అని పాటలు రాశారని, సర్కారు దావఖానాల్లో కుక్కలు నివాసముండేవని, కానీ నేడు నేను సర్కారు దవాఖానకే వెళ్తాను అని అంటున్నారని, ఆడపిల్ల పుడితే 13000 వేలు, మగ బిడ్డ పుడితే 12000 వేలు, అలాగే కెసిఆర్ కిట్ ఇస్తున్నారని.. డాక్టర్లు సిబ్బంది బాగా చూసుకుంటున్నారని అయన స్పష్టం చేసారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచిన ఘనత సీఎం కేసీఆర్ దని, చిన్న ఉద్యోగులను కూడా కేసీఆర్ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ కృషి వల్ల హుస్నాబాద్ లో మాత శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటయిందని, ఏడాదికి 14 లక్షల మంది ఆడపిల్లల వివాహాలు అవుతున్నాయని, వారందరికీ కల్యాణ లక్ష్మి పథకం ద్వారా లబ్ది చేకూరుతుందని అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో 11 వేలమందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద లబ్ధి చేకూరిందన్నారు. హుస్నాబాద్ లో డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల భవనాలు నిర్మించుకున్నాం. ఆస్పత్రిని అభివృద్ధి చేసుకున్నాం. బస్తీ దవాఖాన, ఇండోర్ స్టేడియం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు, గౌరవెల్లి ప్రాజెక్టు, రోడ్లు తదితర వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకున్నామన్నారు. తెలంగాణాలో కెసిఆర్ ప్రభుత్వం వచ్చినప్పుడే అక్కడ మోడీ ప్రభుత్వం కూడా వచ్చిందని, కెసిఆర్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఆశీర్వాదంతో ఎన్నో కార్యక్రమాలను సతీష్ కుమార్ చేశారని, “ఇద్దరు ముగ్గురు బిజెపి కాంగ్రెస్ పోరగాళ్లు నా వాహనాన్ని అడ్డుకోవాలని చూశారని, వీళ్లకు ఏం బాధ వచ్చింది? ఎందుకు అడ్డుకుంటున్నారు? అని సతీష్ కుమార్ అడిగాను… వాళ్లకు ఏం కావాలో తెలియదు” అని చెప్పారని కేటీఆర్ అన్నారు.

- Advertisement -

ధాన్యం కొంటాం.. రైతుల్ని ఆదుకుంటాం

కెసిఆర్ లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తా.. అని నీళ్లు ఇచ్చి చూపించాడని, దేవాదుల, కాకతీయ, మిడ్ మానేరు ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లు తీసుకువచ్చారని గుర్తు చేసారు. బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి అని, 65 లక్షల మంది రైతులకు రైతుబంధు కింద పెట్టుబడి సహాయం అందిస్తున్న ఒకే ఒక్క నాయకుడు భారత దేశంలో కెసిఆర్ అని, దురదృష్టవశాత్తు రైతులు మృతి చెందితే రూ. ఐదు లక్షలు రైతు బీమా కింద అందజేస్తున్నారని అన్నారు. ఒక్క హుస్నాబాద్ నియోజకవర్గంలోనే 900 మంది రైతులు ఇప్పటివరకు రైతు బీమా కింద లబ్ధి పొందారని వెల్లడించారు. రైతు బీమా ఇస్తున్న ఒకే ఒక ప్రభుత్వం దేశంలో కెసిఆర్ ప్రభుత్వం అని అన్నారు. రైతులు అకాల వర్షాలు పడుతున్నాయని ఆందోళన చెందుతున్నారని, ధాన్యం తడిసినా, రంగు మారినా మొలకెత్తినా కొనాలని ఇప్పటికే ఆదేశాలు సి ఎం కేసీఆర్ ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. రైతు ప్రభుత్వాన్ని కాపాడుకుంటేనే రైతులకు మనకు మనుగడ అని అన్నారు.

మంచి మినీస్టేడియం నిర్మించండి
హుస్నాబాద్ అభివృద్ధికి రూ. 25 కోట్లు మంజూరు
వేలేరు మండలం నుండి భీమదేవరపల్లికి ఎర్రబెల్లి, కన్నారం
కొత్తపల్లి – జనగామ రోడ్డు విస్తరణకు చేస్తాం: : కేటీఆర్

“హుస్నాబాద్ లో క్రీడాకారులకు ఒక మంచి మిని స్టేడియం నిర్మించండి. అవసరమైతే అధికారులను సిరిసిల్లకు పంపించి ఆ విధంగా.. అంతకంటే బాగా నిర్మాణం చేయించండి. 25 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాల కోసం శాసనసభ్యులు సతీష్ కుమార్ విజ్ఞప్తి మేరకు మంజూరు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. “వేలేరు మండలంలో ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామాలూ ఎర్రబెల్లి కన్నారం గ్రామాలను వేలేరు నుండి భీమదేవరపల్లి మండలానికి మార్చాలని చెప్పారు… వెంటనే ఆదేశాలు ఇవ్వాలని చెప్తాను..” అని కేటీఆర్ అన్నారు. రాజీవ్ రహదారిని అనుకుని ఉన్న కొత్తపల్లి నుండి హుస్నాబాద్ మీదుగా జనగామ వరకు ఉన్న రోడ్డును విస్తరణ చేయాలని సతీష్ కోరారు.. స్టేట్ హైవేగా మార్చాలని విజ్ఞప్తి చేశారు.. ఇది కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి మంజూరయ్యే విధంగా కృషి చేస్తా… బాధ్యత నాది.. వినోద్ కుమార్ ది.. అని కేటీఆర్ హామీ ఇచ్చారు.

మోడీ జన్ ధన్ డబ్బులు ఎటుపోయాయి? : కేటీఆర్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెద్ద పెద్ద మాటలు చెప్పారని, పెద్ద పెద్ద డైలాగులు కొట్టారని, కానీ పెద్ద నోట్లు రద్దుచేసి సామాన్య జనాన్ని ఇబ్బంది పెట్టారని విమర్శించారు. ఆడబిడ్డలు పోపు డబ్బాల్లో దాచుకున్న డబ్బులు తీసుకున్నారని “భాయి ఔర్ బెహనో జన్ ధన్ ఖాతా ఖోలో మై ధనా ధన్ పాసే దాల్ తాహు అని మోడీ అన్నారని, ఒక్కొక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పారని, అవి ఎటు పోయాయని అడిగితే.. తెల్ల మొహం వేసి బయటపడ్డారని కేటీఆర్ ఎద్దేవా చేసారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు సిలిండర్ ధర రూ. 400 ఉండేదని, ఒకసారి మన్మోహన్ సింగ్ పది రూపాయలు పెంచితే…. అయన ప్రభుత్వానికి చేతకావడం లేదని ఇదే బీజేపీ నాయకులు విమర్శించారని గుర్తు చేసారు. కానీ ఇదే సిలిండర్ధర నేడు రూ. 1200 అయిందని దీనికి ఏం సమాధానం చెప్తారని అయన ప్రశ్నించారు. ఓటేస్తే రైతుల ఆదాయం పెంచుతామని అన్నారని, కానీ 623 వ స్థానం నుండి అది అదానీ రెండవ స్థానానికి వెళ్ళాడన్నారు. వినోద్ కుమార్ ను ఓడించి ఒక పిచ్చివాడిని కరీంనగర్ ఎంపీగా తెచ్చుకున్నాం అని కేటీఆర్ బండి సంజయ్ ని ఉద్దేశించి అన్నారు. అతను ఏమి మాట్లాడతాడో… అతనికే తెలియదు… అతడు ఎంపీ అని చెప్పుకోవాలంటే నాకు ఇజ్జత్ అనిపిస్తోంది… కరీంనగర్ ప్రజలు సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందని కేటీఆర్ ఎద్దేవా చేసారు. ఇవాళ ఏం వారం అన్న.. రేపు ఏం వారమన్నా.. అని సిగ్గు లేని మాటలు సంజయ్ మాట్లాడుతున్నాడు… మోడీ దేవుడు అని అంటున్నాడు.. ధరలు పెంచిన వాడు దేవుడు ఎలా అవుతాడు?.. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇస్తా అని చెప్పి ఉద్యోగాలు ఏవి అని అడిగితే… పకోడీలు చేసుకోమని చెప్తున్నాడు…. 70 రూపాయలు ఉన్న పెట్రోల్ ధర 110 రూపాయలు చేసాడు….అని కేటీఆర్ మండిపడ్డారు. 700 మంది రైతులు చనిపోయినందుకు మోడీ కారకుడు అయ్యాడని, మతం పంచాయితీ పెట్టి పిల్లల మనసుల్లో విషయం చిమ్ముతున్నారని అయన విమర్శించారు. కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం అదానికి రుణమాఫీ చేసిందని, కేంద్రాన్ని నమ్ముకుంటే మనకు శఠగోపం పెడతారని, గుండు కొట్టి వదిలేస్తారని అన్నారు.

బండి.. ఏం తెచ్చావు? తవ్వాల్సింది మసీదులు కాదు… పునాదులు.. : కేటీఆర్

గడచిన తొమ్మిదేళ్లలో ఏం చేశారని అడిగితే సతీష్ కుమార్ గంటసేపు నియోజకవర్గంలో జరిగిన వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాల లెక్క గురించి చెప్తారని, అదే దమ్ము బండి సంజయ్ కి ఉందా? ఏం చేశావు నాలుగున్నర ఏళ్లలో ఎంపీగా? ఒక్క పైసా పని చేసావా హుస్నాబాద్ కు? చెప్పే దమ్ముందా? అని కేటీఆర్ బండి సంజయ్ ని ప్రశ్నించారు. అడ్డగోలు మాటలు మాట్లాడి పోరగాళ్లను ఆగం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ఒక కాలేజీ.. ఒక యూనివర్సిటీ.. ఒక గుడి.. ఒక బడి. ఒక్కటైనా కట్టించావా? మసీదులు తవ్వుదాం అని అంటాడని… తవ్వాల్సింది మసీదులు కాదు.. పునాదులు.. కాలువలు… అని, తవ్వాల్సింది డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు పునాదులు… కొత్త రైల్వే లైనులకు పునాదులు అని కేటీఆర్ అన్నారు.

వినోద్ కుమార్ ను గెలిపించాలి: కేటీఆర్

మంచి నాయకుడు, మంచి మనిషి బోయినపల్లి వినోద్ కుమార్ ను ఓడించి.. ఓ పిచ్చోడిని గెలిపించారు.. ఈసారి అలా జరగద్దు తప్పు చేయవద్దు.. అసెంబ్లీ ఎన్నికల్లో సతీష్ కుమార్ కు 70 వేల మెజారిటీ ఇచ్చి వినోద్ కుమార్ కు మాత్రం 25 వేల మెజారిటీ ఇచ్చారు.. ఈసారి సతీష్ అన్నకు లక్ష మెజారిటీ ఇస్తే వినోదన్న కు ఒక ఓటు ఎక్కువే రావాలి అని కేటీఆర్ అన్నారు. పిచ్చి బండి సంజయ్ ని ఇంటికి పంపాలని .. పార్లమెంట్లో గట్టిగా తెలంగాణ వాణి ని వినిపిస్తే మనకు కూడా ఒక త్రిబుల్ ఐటీ.. విశ్వవిద్యాలయాలు వచ్చేవి…. జాతీయస్థాయి కార్యక్రమాలు జరిగేవి..అని అన్నారు.

కాంగ్రెస్ ఏమి చేయలేదు… మళ్ళీ అవకాశమా? : కేటీఆర్

కాంగ్రెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.. వాళ్లని చూస్తే నవ్వాలో ఏడవాలో తెలియడం లేదు… ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు… 75 ఏళ్లు అవకాశమిస్తే ఏం చేశారు? అని కేటీఆర్ విమర్శించారు. ఒక్క సారి కాదు… పది సార్లు అవకాశం ఇచ్చారు.. 55 సంవత్సరాలు ఢిల్లీలో, రాష్ట్రంలో ఏలింది కాంగ్రెస్ పార్టీ కాదా? ఇదే హుస్నాబాద్ లో.. హుజురాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించలేదా..? ఏం చేశారు? కరెంటు ఇవ్వలేదు.. తాగునీరు ఇవ్వలేదు.. రోడ్లు వేయలేదు.. కులవృత్తులకు చేయూత ఇవ్వలేదు… రాష్ట్రాన్ని సర్వనాశన చేసి మళ్లీ ఇప్పుడు వచ్చి ఒక అవకాశం ఇవ్వండి అని అంటున్నారు అని కేటీఆర్ విమర్శించారు.

సతీషన్న చూస్తే.. సాఫ్ట్.. కానీ హార్డ్ వేర్ గట్టిది.. : కేటీఆర్

“మీ ఎమ్మెల్యే సతీష్ అన్న మంచోడు ఏమి కావాలి అని అడిగితే.. మీరే చెప్పండి అన్న” అని అన్నారు. సతీష్ చూడడానికి సాఫ్ట్ గా కనిపిస్తాడు కానీ హార్డ్వేర్ గట్టిగా ఉంది అని కేటీఆర్ చమత్కరించారు. సాఫ్టు కనిపిస్తాడు కానీ పని దగ్గర గట్టోడు… అని ప్రశంసించారు. “మొదటిసారి సతీష్ కుమార్ ను 34 వేల మెజారిటీతో ప్రజలు గెలిపించారు. రెండోసారి 70 వేల మెజారిటీతో గెలిపించారు. లక్ష ఎకరాలకు నీళ్లు తెచ్చిన సతీష్ కుమార్ కు లక్ష కోట్ల మెజారిటీ ఈసారి ఇవ్వాలని” కేటీఆర్ కోరారు. ఈ ప్రాంత రైతుల కష్టాలు తీర్చినందుకు అలాగే ఈ ప్రాంత రైతుల కుటుంబాల్లో ఒకడిగా మెదిలినందుకు గోదావరి జలాలు తెచ్చి రైతుల పాదాలు కడిగినందుకు.. లక్ష మెజారిటీ మీరంతా ఇవ్వాలని కేటీఆర్ ప్రజలనుద్దేశించి అన్నారు. సతీష్ అన్న సౌమ్యుడు, మంచి మనిషి, అజాతశత్రువు, చీమకు కూడా హాని చేయని మంచి మనిషి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మంచి నాయకుడు అజాతశత్రువు సౌమ్యుడు సతీష్ కుమార్ ను లక్ష కోట్ల మెజారిటీతో త్వరలో జరిగే ఎన్నికల్లో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని, హుస్నాబాద్ అభివృద్ధి విషయంలో సీఎం కేసీఆర్ హరీష్ రావు తో పాటు తానూ అండగా ఉంటామని, ఒక సోదరునిలా ఉంటానని కేటీఆర్ అన్నారు. నియోజకవర్గంలో ఏ పనులు మిగిలి ఉన్న బ్రహ్మాండంగా చేసుకుందామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News