KTR-Harish Rao| కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కాసేపట్లో హైదరాబాద్ పర్యటనకు రానున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
ఎన్నికల్లో అడ్డగోలు హామీలతో మోసం చేసిన రాహుల్ గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాష్ట్రంలో పర్యటించాలని కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు. పదేళ్ల పాటు పచ్చగా ఉన్న తెలంగాణ మీ ఏడాది పాలనలోనే ఏ విధంగా వందేళ్ల విధ్వంసానికి గురైందో మీ రాక సందర్భంగా బహిరంగ లేఖతో ఒక్కసారి గుర్తు చేయదలచుకుంటున్నా అని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలతో ప్రజల గొంతుకోశారని, పిలిస్తే పలుకుతానని పారిపోయిందెవరని ప్రశ్నించారు. ఇన్నాళ్లు ఎక్కడ దాక్కున్నారంటూ నిలదీశారు. రైతులు, నిరుద్యోగులు, పోలీసులు, చేనేత కార్మికులు, ఆటోడ్రైవర్లు అందరూ మీ ప్రభుత్వ బాధితులేనని చెప్పుకొచ్చారు. మూసీ, హైడ్రా పేరిట ప్రజలను వంచించారని మండిపడ్డారు. దమ్ముంటే అశోక్ నగర్ నిరుద్యోగులను పలకరించండని సవాల్ చేశారు.
మరోవైపు హరీష్‌రావు(Harish Rao)కూడా రాహుల్ పర్యటనపై విరుచుకుపడ్డారు. హమీలతో తెలంగాణ యువతను రాహుల్ గాందీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. ఎక్స్ వేదికగా ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. మీరు ఎన్నికల సమయంలో మీర సందర్శించిన ఆశోక్ నగర్‌లోనే విద్యార్థులు, నిరుద్యోగులను మీ ప్రజా ప్రభుత్వం చితకబాదించిన సంగతి మీకు తెలుసా అంటూ ప్రశ్నించారు. మీ ప్రభుత్వం వాగ్దానం చేసిన 2 లక్షల ఉద్యోగాలలో 10% కంటే తక్కువ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారని గుర్తుచేశారు. జాబ్ క్యాలెండర్ ఉద్యోగం లేని జాబ్ క్యాలెండర్‌గా తయారైందన్నారు. యువ వికాసం 5 లక్షల హామీ గ్యారంటీ ఖాళీ గ్యారెంటీగా మారడంతో తెలంగాణ యువతకు అభద్రతాభావం ఏర్పడిందని విమర్శించారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా మీరు అశోక్ నగర్‌ని మళ్లీ సందర్శించండని, మీ ప్రభుత్వం దానిని ‘శోక నగర్’గా ఎలా మార్చుకుందో చూడండని సూచించారు.