త్వరలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలిపారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) నోటి నుంచి మూడు ఆణిముత్యాల లాంటి మాటలు వినిపించాయన్నారు. “మంచి మైక్‌లో చెప్పాలి చెడు చెవిలో చెప్పాలి అన్నారు. మంచి చెప్పడానికి నువ్వు చేసిన ఒక్క మంచి పని లేదు” అని విమర్శించారు. రేవంత్ రెడ్డి చేసిన చెడు చెబితే.. చెవిలో రక్తాలు కారుతాయని ఎద్దేవా చేశారు.
ఇక రాష్ట్రానికి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తన బ్యాగ్ ఎవరూ మోయొద్దు అని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆమె పక్కన కూర్చున్న రేవంత్ రెడ్డినే బ్యాగ్‌లు మోసి పైకి వచ్చారని తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ప్రజలందరూ తెగ తిడుతున్నారని విమర్శించారు. రాబోయే పంచాయతీ ఎన్నికలు అయినా.. ఉప ఎన్నికలు అయినా.. పార్లమెంట్ ఎన్నికలు అయినా.. గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.