అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల రామారావు పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరులో 14.88 కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళలకు 750 కోట్ల వడ్డీలేని రుణాల పంపిణీని ప్రారంభించారు. అభయ హస్తం నిధులను వడ్డీతో సహా తిరిగి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని 21,32,482 మంది సభ్యులకు 546 కోట్ల పంపిణీ ప్రారంభమైంది. పాలకుర్తి నియోజకవర్గంలో 4,342 మహిళా సంఘాలకు 204 కోట్లు పంపిణీ చేశారు.
ఎర్రబెల్లి అత్యుత్తమ మంత్రి
ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. “పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు దేశంలోనే అత్యుత్తమ మంత్రి. ఈ మాట నేను చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వమే అనేక సార్లు ప్రకటించింది. ఆయన నిర్వహిస్తున్న శాఖలకు అనేక అవార్డులు ఇచ్చింది. దేశంలో 20 గ్రామ పంచాయతీలకు అవార్డలు ఇస్తే 19 తెలంగాణ పల్లెలే. నిన్న మొన్న స్టార్ 3, స్టార్ 4 లోనూ మొదటి మూడు జిల్లాలు మనవే ఉన్నాయి” అన్నారు.
అవార్డులు ఊరికే వస్తున్నాయా?
“దేశంలోనే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు దేశంలోనే అత్యుత్తమ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి. నేను చెప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వమే పదేపదే ప్రకటిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం వరసగా ఏ ర్యాంకు లు ఇచ్చినా అవి తెలంగాణ కే వస్తున్నాయి. సీఎం కెసీఆర్ గారి నేతృత్వంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అద్భుతంగా పని చేస్తున్నది. అందుకే అవార్డుల మీద అవార్డులు వస్తున్నాయి. మేము చెప్పేది తప్పు అయితే, ఇంతకుముందు ఈ అవార్డులు ఎందుకు రాలేదు? ఈ అవార్డులు ఊరికే వస్తున్నాయా?” అని కెటిఆర్ ప్రశ్నించారు.
కేసీఆర్ అంటే..
K-కాలువలు, C-చెరువులు, R-రిజర్వాయర్లు అంటూ సరికొత్త నిర్వచనం ఇచ్చారు కేటీఆర్. తెలంగాణలో ప్రజలకు ఏమి చేశామో, గంటల కొద్దీ చెప్పే దమ్ము మాకు ఉంది. మరి మీరు మీ రాష్ట్రాల్లో ఏమి చేశారు? చెప్పాలి. ఈ మోడీ ప్రియమైన ప్రధాన మంత్రి కాదు పిరమైన్ ప్రధాన మంత్రి అని కెటిఆర్ చమత్కరించారు.