Jubilee Hills Bye-Election: తెలంగాణలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీ తన ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, హామీల అమలులో జాప్యాన్ని ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సరికొత్త వ్యూహానికి తెరతీశారు. అదే ‘కాంగ్రెస్ బకాయి కార్డు’ ఉద్యమం. ఈ ఉద్యమంలో భాగంగా కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్‌పేటలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి స్వయంగా ‘కాంగ్రెస్ బకాయి కార్డు’ను పంపిణీ చేశారు.
హామీల మోసంపై ‘బాకీ కార్డు’ దాడి
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ… కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో దేనినీ పూర్తిగా అమలు చేయలేకపోయిందని విమర్శించారు. “ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం పడ్డ బకాయిలను ఈ ‘బాకీ కార్డు ఉద్యమం’ ద్వారా గుర్తు చేస్తాం. మోసపూరిత హామీలపై ప్రజల్లో చైతన్యం నింపుతాం” అని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికలు కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పే అద్భుతమైన అవకాశం అని, ఈ ఎన్నికల్లో వారికి గుణపాఠం తప్పదని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. “ప్రచారం చేయడానికి వచ్చేది టూరిస్టు మంత్రులు. ఎన్నికలు కాగానే మంత్రులు, సామంతులు అందరూ మాయమైపోతారు. ప్రజల కష్టసుఖాల్లో శాశ్వతంగా పాలుపంచుకునేది బీఆర్ఎస్ నేతలే” అని ఆయన స్పష్టం చేశారు.


