KTR meeting on by-election issue: నేతల జీవితాలు ఎంత దారుణంగా ఉంటాయో మాగంటి గోపీనాథే ఉదాహరణ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులు ఇంకా కూడా సెటిల్ కాలేదని తెలిపారు. మనం మళ్లీ అండగా ఉంటే గోపీనాథ్ కుటుంబం నిలబడుతుందని కార్యకర్తలతో కేటీఆర్ ముచ్చటించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించిన కసరత్తులో భాగంగా.. తెలంగాణభవన్‌లో కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ డబ్బులు పంచి గెలవాలనుకుంటుంది: కాంగ్రెస్ ఒక్క పథకం కూడా సరిగా అమలుచేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రెండు సార్లు రైతుబంధు ఎగ్గొట్టి ఒక్కసారి మాత్రమే రైతులకు ఇచ్చారని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు సంగతి దేవడెరుగు కానీ.. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చుతున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. గోపీనాథ్ ఉండి ఉంటే కాంగ్రెస్ ఆటలు సాగేవి కావని అన్నారు. గోపీనాథ్ పేదలకు అండగా ఉండేవారని తెలిపారు. ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం డబ్బులు పంచి గెలవాలనుకుంటుందని కేటీఆర్ ఆరోపించారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ కసరత్తు: రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇక్కడ గెలుపు కోసం బీఆర్ఎస్ కసరత్తులు చేస్తోంది. తిరిగి తమ స్థానాన్ని దక్కించుకునేలా బీఆర్ఎస్ ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందులో భాగంగా కేటీఆర్ టీడీపీ మద్దతు కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను గతంలో కలిశారని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. అక్కడ బీఆర్ఎస్ గెలిచేందుకు టీడీపీ మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరినట్లు పలువురు హస్తం నేతలు సైతం ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను బీఆర్ఎస్ వర్గాలు ఖండిస్తున్నాయి.


