Saturday, November 15, 2025
HomeతెలంగాణKTR: స్థానిక ఎన్నికలు బహిష్కరించండి.. భూ నిర్వాసితులకు కేటీఆర్‌ సూచన

KTR: స్థానిక ఎన్నికలు బహిష్కరించండి.. భూ నిర్వాసితులకు కేటీఆర్‌ సూచన

KTR on land acquisition farmers issue: ట్రిపుల్‌ఆర్‌ భూనిర్వాసితుల విషయంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాకు చెందిన ఆర్‌ఆర్‌ఆర్‌ బాధితులంతా ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల ట్రిపుల్‌ఆర్‌ భూనిర్వాసిత బాధితులు సోమవారం తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మీ సమస్య పరిష్కరించకపోతే త్వరలో జరగబోయే సర్పంచ్‌, ఎంపీటీసీ, జెడ్పీటీసీ తదితర స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలి. స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించడం వల్ల మీ సమస్య దిల్లీ స్థాయిలో చర్చనీయాంశమవుతుంది. అసెంబ్లీలో మాకు మైక్‌ ఇవ్వట్లేదు. ప్రతిపక్షాలకు మైక్‌ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం భయపడుతోంది. కత్తి వాళ్ల చేతిలో పెట్టి యుద్ధం మమ్మల్ని చేయమంటున్నారు. కాంగ్రెస్‌ నేతల భూముల్లో రోడ్డు వెళ్లకుండా అలైన్‌మెంట్‌ మార్చడం కొత్తేం కాదు. గతంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు వేసినప్పుడు కూడా అష్ట వంకర్లు తిప్పారు. గతంలో ఓఆర్‌ఆర్‌కు భూసేకరణ సమయంలోనూ భూమికి బదులు భూమి ఇచ్చారు. ట్రిపుల్‌ ఆర్‌ వల్ల భూమి కోల్పోతున్న రైతులకు భూమి కావాలంటే పోరాటం చేయొచ్చు. అలైన్‌మెంట్‌ శాస్త్రీయంగా ఉండాలని ఉద్యమం చేద్దాం” అని కేటీఆర్‌ అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి నల్గొండ జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలు జగదీశ్‌రెడ్డి, కర్నె ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/cinema-news/power-star-og-mania-everywhere/

అలైన్‌మెంట్‌ మార్చాలంటూ భూ నిర్వాసితుల డిమాండ్‌..

కాగా, ట్రిపుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ అంతటా ఒకేలా ఉండాలని, అందుకు విరుద్ధంగా ఉన్న అలైన్‌మెంట్‌ను మార్చాలని గత కొంత కాలంగా భూ నిర్వాసితులు డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు. ఆయా జిల్లాల పరిధిలోని కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన నిర్వహించి కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్నారు. ఔటర్‌ రింగు రోడ్డు నుంచి ట్రిపుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ 40 కి.మీ దూరంలో ఉంటే, ఎన్‌హెచ్‌ 65, ఎన్‌హెచ్‌ 163 వద్ద 28 కి.మీ వరకే తీసుకోవడంతో రైతులకు అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం ప్రజాభిప్రాయ సేకరణ చేసి 80 శాతం మేరకు ఒప్పందం పొందాకే భూములు తీసుకోవాలనే నిబంధనలను అధికారులు పాటించడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో ఎన్‌హెచ్‌-65 వద్ద ట్రిపుల్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ దివీస్‌ ల్యాబొరేటరీ కంపనీ వెలుపల నుంచి ఉందని, ప్రస్తుతం దీన్ని మార్పు చేసి చౌటుప్పల్‌ పట్టణం నుంచి రహదారి వెళ్లేలా చేయడం దారుణమని వాపోతున్నారు. ప్రభుత్వం భూసేకరణ తప్పనిదని భావిస్తే మున్సిపాలిటీల్లో బహిరంగ మార్కెట్‌ ధరకు రెండింతలు, గ్రామీణ ప్రాంతాల్లో నాలుగు రెట్లు ధర ఇవ్వాలని, లేదంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ విషయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలను సైతం కలుస్తున్నారు. ఇలా సోమవారం, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad