ఫార్ములా ఈ-రేస్ కేసు (Formula E-Race Case) విచారణలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అంతకుముందు బంజారాహిల్స్ నందినగర్‌లోని ఆయన నివాసం నుంచి తన న్యాయవాదులతో కలిసి బయలుదేరారు. కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారని తెలియడంతో ఆయన నివాసానికి మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భారీగా తరలివచ్చారు. మరోవైపు వందల మంది బీఆర్ఎస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
ఏసీబీ ప్రధాన కార్యాలయం వద్ద తన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తోందని ఆరోపించారు. తనతో పాటు లాయర్లు వస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదన్నారు. చట్టాలను గౌరవించి విచారణకు వచ్చానని తెలిపారు. తర్వలోనే తన ఇంటిపై ఐటీ రైడ్స్ కూడా చేయబోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ఐఏఎస్ అధికారి దానకిశోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను విచారణ చేయనున్నారు.