ఫార్ములా ఈ-రేసు(Formula E-Race) వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు(TG Highcourt) కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్డర్ కాపీలో కీలక అంశాలు ప్రస్తావించింది. HMDA పరిధికి మించి డబ్బు బదిలీ జరిగిందని హైకోర్టు వెల్లడించింది. కేటీఆర్ ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయని అంటున్నారని.. ఈ చెల్లింపులతో ఎవరు లబ్ధి పొందారో తెలియాలని అభిప్రాయపడింది. ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణకు తగిన సమయం ఇవ్వాలని తాము ఇప్పడే జోక్యం చేసుకోలేమని ధర్మాసనం వెల్లడించింది.
ఏసీబీ చేసిన ఆరోపణల్లోకి వెళ్లి దర్యాప్తు చేయాలని కోర్టు భావించడం లేదని తెలిపింది. ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసే అధికారాన్ని కోర్టు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యుడిగా ఉండాలని సూచించింది. ఉత్తమ పరిపాలన అందించే బాధ్యత మంత్రులపైనే ఉంటుందని వ్యాఖ్యానించింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఉత్తర్వులను హైకోర్టు ఉదహరించింది. ఈ తీర్పు కేటీఆర్ క్వాష్ పిటిషన్‌కు మాత్రమే వర్తిస్తుందని హైకోర్టు వెల్లడించింది.