ఫార్ములా ఈ-రేస్(Formula E-Race) వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం కీలక అంశాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ రేస్ నిర్వహించిన గ్రీన్‌కో(Greenko) సంస్థ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయలు లబ్ధి చేకూరినట్లు వెల్లడించింది. ఈ కంపెనీ ఎన్నికల బాండ్ల ద్వారా ఆ పార్టీకి రూ.41 కోట్లు చెల్లించినట్లు తెలిపింది. 2022 ఏప్రిల్ 8- అక్టోబర్ 10 మధ్య గ్రీన్‌కో, దాని అనుబంధ సంస్థలు 26 సార్లు ఈ బాండ్లు కొన్నట్లు పేర్కొంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తాజాగా ప్రభుత్వం చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) స్పందించారు. 2022లో గ్రీన్ కో సంస్థ ఎన్నికల బాండ్లు ఇచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. కానీ ఫార్ములా ఈ-రేస్ జరిగింది 2023లో అని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు కూడా గ్రీన్ కో బాండ్లు ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫార్ములా ఈ-రేసు కారణంగా గ్రీన్ కో, దాని అనుబంధ సంస్థలు చాలా నష్టపోయాయన్నారు. పార్లమెంట్ ఆమోదించాక ఎన్నికల బాండ్లు ఎలా అవినీతి అవుతాయని ఆయన ప్రశ్నించారు. మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఎన్నికల బాండ్లపైనా చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.