కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు… ఉన్న కంపెనీలు పోకుండా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. సిద్ధిపేటలోని ఐటీ హబ్(IT HUB)కు ఇంటర్నెట్ లేకపోవడంతో మూడ్రోజులుగా సేవలు నిలిచిపోయాయని.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఉద్యోగులను అధికారులు ఆదేశించారంటూ ఓ పేపర్లో కథనం ప్రచురితమైంది. దీనిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.
“హైదరాబాద్ నగరం ఒక్కటే కాకుండా తెలంగాణలోని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ రంగాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు ఎనిమిది ఐటీ హబ్‌లను ఏర్పాటు చేసింది. కానీ కాంగ్రెస్ రాగానే… చక్కగా నడుస్తున్న ఆ ఐటీ హబ్‌లు ఒక్కొక్కటిగా పట్టాలు తప్పుతున్నాయి. విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులు కూడా కట్టని దుస్థితికి చేరుకున్నాయి. ఫలితంగా కంపెనీలు మూతపడుతున్నాయి. గత ప్రభుత్వం మీద కోపంతో ఇలాంటి దుశ్చర్యలు మానుకోవాలి. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే సదుద్దేశంతో నెలకొల్పిన ఈ ఐటీ హబ్‌లను సక్రమంగా నడపాలని కోరుతున్నాను” అంటూ ఆయన విజ్ఞప్తి చేశారు.