ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Elections) ప్రచారంలో కాంగ్రెస్ హామీల పోస్టర్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) సెటైర్లు వేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“తల్లికి బువ్వ పెట్టనోడు-చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు ఉంది. తెలంగాణలో 420 హామీలు ఇచ్చి గంగలో కలిపి- ఢిల్లీ పురవీధుల్లో కొత్త నాటకం మొదలు పెట్టిండు. తెలంగాణలో సాగుతున్న నికృష్ట పాలన – ఢిల్లీలో కూడా చేయిస్తానని బయలుదేరిన పులకేశి… ఉచిత కరెంటు ఇచ్చింది ఎవరికి ? -గ్యాస్ సబ్సిడీ ఇచ్చింది ఎవరికి? నెలకు రూ.2500 ఇస్తున్న మహిళలు ఎవరు ? – తులం బంగారం ఇచ్చిన ఆడబిడ్డలు ఎవరు ? రైతుభరోసా రూ.7500 ఇచ్చిందెక్కడ ? ఆసరా ఫించన్లు రూ.4000 చేసిందెక్కడ ? రూ.5 లక్షల విద్యాభరోసా ఎక్కడ ? విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటీలు ఎక్కడ ?” అని ప్రశ్నించారు.
“పేరు గొప్ప ఊరుదిబ్బ అన్నట్టు ఇక్కడ హామీలకు దిక్కులేదు గాని అక్కడ ఢిల్లీ ప్రజలకు గ్యారంటీలు ఇస్తున్నావా. ఈడ ఇచ్చిన హామీలకు దిక్కు లేదు.. ఢిల్లీలో ఇస్తున్న హామీలకు గ్యారంటీ ఇస్తున్నావా ? ఢిల్లీ గల్లీల్లో కాదు దమ్ముంటే మీ ఢిల్లీ గులాంతో అశోక్ నగర్ గల్లీల్లో చెప్పు.. ఉద్యోగాలు ఇచ్చామని… నవ్విపోదురు గాక .. నాకేంటి సిగ్గు అన్నట్లుంది రేవంత్ వ్యవహారం. జాగో ఢిల్లీ జాగో” అని కేటీఆర్ విమర్శించారు.