కళ్యాణలక్ష్మిని వడ్డీ వసూలు స్కీంగా మార్చడానికి సిగ్గులేదా అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) మండిపడ్డారు. ఓ మహిళకు తన కుమార్తె వివాహం అనంతరం వచ్చిన కళ్యాణలక్ష్మి(Kalyana Lakshmi) సొమ్మును సిరిసిల్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకు అధికారులు పంటరుణం కింద జమ చేసుకున్నారని ఓ కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు.
“ఆడబిడ్డ పెళ్లి చెయ్యడం కష్టం కావొద్దని, కేసీఆర్(KCR) తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకాన్ని వడ్డీ వసూలు స్కీంగా మార్చడానికి సిగ్గులేదా? వచ్చిన కల్యాణలక్ష్మి లక్ష రూపాయలలో రూ.60 వేలు బ్యాంకుకి, రూ.40 వేలు లబ్ధిదారునికా?, నువ్వు నడిపేది ప్రభుత్వమా? రికవరీ ఏజెన్సీనా? అందరికీ రెండు లక్షల పంట రుణ మాఫీ చేసాము అని బాకాలు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. సోంబాయి కన్నీటికి కారణం ఎవరు! తనకు రావాల్సిన కల్యాణలక్ష్మి డబ్బులులో రూ.60 వేలు ఎందుకు గుంజుకున్నారు అని!, తులం బంగారం అన్నారు.. ఆఖరికి కల్యాణలక్ష్మి డబ్బులులో కూడా కొర్రీలు పెడుతున్నారు. దందాలు, వసూళ్లు మాత్రమే తెలిసిన రేవంత్ రెడ్డికి ఒక చిన్న సలహా! కనీసం ఆడపిల్ల పెళ్లి డబ్బుల జోలికి పోవద్దు! వినడానికే అసహ్యంగా ఉంది” కేటీఆర్ తెలిపారు.