KTR| బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. గులాబీ పార్టీ శ్రేణులను ఉద్దేశిస్తూ సంచలన ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ప్రజలను పాలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని కేటీఆర్ విమర్‌శించారు. ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని ఎండగడుతున్నందుకు బీఆర్‌ఎస్ పార్టీ మీద కాంగ్రెస్ నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారని తెలిపారు. అందుకే బీఆర్ఎస్ నేతలపై రానున్న రోజుల్లో ఏమైనా జరగొచ్చని.. గులాబీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
“కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో మద్దతు పలికిన బీఆర్ఎస్ సోషల్‌మీడియా వారియర్స్‌కు ధన్యవాదాలు. గత రెండు రోజులుగా మనం చూసింది సుదీర్ఘమైన రాజకీయ కక్ష సాధింపుల ప్రహాసనంలో తొలి అంకం మాత్రమే. రానున్న రోజుల్లో మనపై అనేక విధాలుగా బురదజల్లేందుకు ప్రయత్నిస్తారు. అందుకే ఈ కుట్రలు, వ్యక్తిగత దాడులు, అబద్దపు ప్రచారాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి” అని హెచ్చరించారు.
అక్రమ కేసులు పెడతారు.. డీప్‌ఫెక్ టెక్నాలజీతో వీడియోలు వదులుతారు. పెయిడ్ ఆర్టిస్టులతో నాటకాలు వేస్తారు. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలు తమ పెయిడ్ సోషల్‌మీడియా ట్రోల్స్ అందరూ మనపై దాడికి ఏకమవుతారు. ఈ దాడులను చూసి ఆగం కావద్దు.. ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటంలో ఏ మాత్రం పక్కకు జరగవద్దు. తెలంగాణ ప్రజల బాగు కోసం మనం చేస్తున్న పోరాటాన్ని కొనసాగిద్దాం. కాంగ్రెస్ అవినీతి, అసమర్థత, ద్వంద్వ నీతిని ఎప్పటికప్పుడు బయటపెడదాం. ఆరు గ్యారంటీలు, 420 వాగ్దానాల అమలులో రేవంత్ ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజల ముందు పెట్టి ప్రజాక్షేత్రంలో శిక్షిద్దాం” అని బీఆర్ఎస్ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాగా ఇంత సడెన్‌గా కేటీఆర్ ఇలా ట్వీట్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జన్వాడ ఫాంహౌస్‌లో కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలతో కుటుంబసభ్యులు మద్యం పార్టీలో పోలీసులకు దొరకడం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ కేసులో రాజ్ పాకాలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ స్కామ్, డ్రగ్స్ కేసు వంటి వాటిలో కొంతమంది బీఆర్ఎస్ కీలక నేతలు అరెస్ట్ అవుతారని మంత్రులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేటీఆర్.. బీఆర్ఎస్ క్యాడర్‌ను అప్రమత్తం చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.