KTR on Revanth Reddy :జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పించారు. ఈ రోజు సీఎం శంకుస్థాపన చేసిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘భారత్ ఫ్యూచర్ సిటీ’పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని షేక్‌పేటలో కేటీఆర్ విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను, సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలను దుయ్యబట్టారు.
వరదల్లో ‘ప్రెజెంట్ సిటీ’.. వ్యాపారంలో ‘ఫ్యూచర్ సిటీ’
కేటీఆర్ మాట్లాడుతూ… హైదరాబాద్ నగరంలో ప్రస్తుత పరిస్థితులను ఎత్తి చూపారు. “ప్రస్తుతం ఉన్న ‘ప్రెజెంట్ సిటీ’ (హైదరాబాద్) భారీ వర్షాలు, వరదలతో మునిగిపోతోంది. పారిశుద్ధ్యం లోపించి దోమలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు కనీస మౌలిక వసతులు లేక సతమతమవుతుంటే, సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ‘ఫ్యూచర్ సిటీ’ కడతానని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి అనేది ప్రజలకు దగ్గరగా ఉండాలి తప్ప, కేవలం భూముల విలువ పెంచడానికి కాదని ఆయన స్పష్టం చేశారు.
మెట్రోపై రేవంత్ రెడ్డి ‘చావు తెలివితేటలు’
మెట్రో రైలు ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి నిర్ణయాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. “ఉన్న మెట్రో రైలు ప్రాజెక్టులను రద్దు చేసి, జనం లేని ఫ్యూచర్ సిటీకి కొత్త మెట్రో కడతాననడం రేవంత్ రెడ్డి చావు తెలివితేటలకు నిదర్శనం” అని దుయ్యబట్టారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి అత్యవసరమైన మెట్రో విస్తరణ ప్రాజెక్టులను పక్కన పెట్టడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ నిర్ణయం ద్వారా రేవంత్ రెడ్డి ప్రజల అవసరాల కంటే రియల్ ఎస్టేట్ ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు.
గుణపాఠం తప్పదు.. సునీతను గెలిపించండి!
ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ అరాచకాలకు బుద్ధి చెప్పే అవకాశం అని కేటీఆర్ జూబ్లీహిల్స్ ప్రజలను హెచ్చరించారు. “కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు గుణపాఠం చెప్పకపోతే, మరో మూడేళ్లపాటు వారి అరాచకాలకు అడ్డే ఉండదు” అని తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్, బీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను ఆశీర్వదించి, భారీ మెజారిటీతో గెలిపించాలని జూబ్లీహిల్స్ ఓటర్లను అభ్యర్థించారు. అభివృద్ధికి కట్టుబడిన బీఆర్‌ఎస్ అభ్యర్థికే మద్దతు ఇవ్వాలని కోరారు.


