Friday, January 31, 2025
HomeతెలంగాణKTR: బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టును తీవ్రంగా ఖండించిన కేటీఆర్

KTR: బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్టును తీవ్రంగా ఖండించిన కేటీఆర్

బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్‌లను అరెస్టు చేయడం దుర్మార్గం అని మండిపడ్డారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.

- Advertisement -

‘జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్‌లను అరెస్టు చేయడం దుర్మార్గం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వడం లేదని కోటి మంది నగర ప్రజల తరఫున ప్రశ్నిస్తే బయటకి గెంటెస్తారా?. గత సంవత్సరం పెట్టిన బడ్జెట్ నిధులను కనీసం కూడా ఖర్చు చేయకుండా.. మరోసారి అవే కాగితాల పైన అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజా ప్రతినిధుల గొంతు నొక్కుతారా?. పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా వంటి కనీస ప్రజా సౌకర్యాలను కూడా సరిగ్గా నిర్వహించలేని జీహెచ్ఎంసీ అసమర్ధ తీరును ప్రశ్నిస్తే కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోవడం లేదు. హైదరాబాద్ నగర ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వెంటనే పూర్తి చేయాలి. అప్పటిదాకా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పురపాలక శాఖకు బాధ్యత వహిస్తున్న ముఖ్యమంత్రిని నిలదీస్తూనే ఉంటాం. అరెస్టు చేసిన కార్పొరేటర్లను, పార్టీ నేతలను వెంటనే విడుదల చేయాలి. ఇచ్చిన హామీలను అమలను చేయకుండా అరెస్టుల పేరుతో ప్రజాప్రతినిధులను అణగదొక్కాలని చూస్తే.. ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మా పార్టీ తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

కాగా జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై చర్చించాలంటూ మేయర్ పోడియం వద్ద బీఆర్ఎస్ కార్పొరేటర్‌లు నిరసన చేపట్టారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం బీఆర్ఎస్ సభ్యులను మేయర్ సస్పెండ్ చేశారు. మేయర్ తమకు క్షమాపణ చెప్పే వరకు కదిలేది లేదంటూ కార్యాలయం బయట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News