KTR Tweet on JubileeHills Elections Not To Vote for Congress: కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మరోసారి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేయాలంటే.. జూబ్లీహిల్స్ ప్రజలు ఉప ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలన్నారు. అలా ఓడిస్తేనే ఆ పార్టీకి భయం పట్టుకుని హామీలను అమలు చేస్తుందని జోస్యం చెప్పారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్ కూడా రాకుండా ఓడించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం దిగజారి రాజకీయాలు చేస్తోందని, అసత్య ప్రచారంతో గెలవాలని చూస్తోందని ధ్వజమెత్తారు. తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఆ పార్టీ క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. అందుకే పార్టీ పరువును కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోందని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అందుకే, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీని ఓడించడం ద్వారానే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేస్తుందని ఆయన అన్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ‘ఆపదమొక్కులు’ మొక్కుతోందని కేటీఆర్ విమర్శించారు. పార్టీ పరువు కాపాడుకోవడం కోసమే రకరకాల ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే సినీ కార్మికులకు కొత్త వాగ్దానాలు చేయడం, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోవడం, మంత్రులు గతంలో ఎన్నడూ లేనంత హడావుడిగా హైదరాబాద్ వీధుల్లో తిరగడం వంటివి చేస్తున్నారని ఆరోపించారు. ఇవన్నీ కాంగ్రెస్ తీవ్ర ఒత్తిడిలో ఉందనడానికి నిదర్శనమని ఆయన విమర్శించారు. కాగా, ఈ ఉపఎన్నికలో ప్రజలు కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెబితేనే, రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
I guess desperate times call for desperate measures 😁
After 2 years in Govt, looks like Congress party is finally waking up to ground realities
Promising the moon to cine workers, inducting Azharuddin in cabinet and ministers desperately running around in Hyderabad Gullies…
— KTR (@KTRBRS) October 30, 2025
జూబ్లీహిల్స్ నుంచే బీఆర్‌ఎస్ జైత్రయాత్ర..
కాగా, కేటీఆర్ ఇటీవల మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే బీఆర్‌ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వాస్తవం కాలేదని, పేదల ఆశలు దెబ్బతిన్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కష్టాలు తగ్గాయని కేటీఆర్ గుర్తుచేశారు. 20 వేల లీటర్ల వరకు ఉచిత మంచినీళ్లు, బస్తీ దవాఖానాలు, రూ.5 కే భోజనం, పింఛన్లు, రంజాన్ తోఫాతో పాటు అనేక పథకాలు అమలు చేశామని, ప్రాపర్టీ ట్యాక్స్‌ను కూడా తీసేశామని తెలిపారు. కాంగ్రెస్ వాళ్లు ఇంటికి వస్తే బాకీ కార్డు చూపించి ఇచ్చిన హామీల గురించి ప్రశ్నించాలని ఓటర్లను కోరారు. ఒక్కొక్క మహిళకు నెలకు రూ.2500 చొప్పున ఇప్పటి వరకు రూ.60 వేలు, వృద్ధులు, వితంతువులకు రూ.48 వేలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని ఆయన పేర్కొన్నారు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే.. మేం ఏం చేయకపోయినా.. మోసం చేసినా మాకే ఓటేస్తున్నారని వాళ్లు భావిస్తారని, ఇన్ని రకాలుగా మోసం చేసినా.. మళ్లీ మాకే ఓటేస్తున్నారంటే మేమే కరెక్ట్ అని వాళ్లు అనుకుంటారని హెచ్చరించారు.


