KTR Tweet ON Rahul Gandhi about MLAs detention: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనని బీఆర్‌ఎస్ పట్టుబడుతోంది. ఈ అంశంపై సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. అయితే, తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరినప్పటి ఫొటోలను షేర్ చేశారు. ‘‘పై ఫొటోల్లో కాంగ్రెస్ కండువా కప్పుకున్న వాళ్లను రాహుల్ గాంధీ గుర్తు పడతారా? దిల్లీలో వారు రాహుల్ గాంధీని కూడా కలిశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని అంటున్నారు. అది కాంగ్రెస్ కండువా కాదా? రాహుల్ గాంధీ అంగీకరిస్తారా? ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా? ఓట్ చోరీ కంటే ఇది చిన్న అంశమా?’’ అని నిలదీశారు. కాగా, గత రెండ్రోజుల నుంచి ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో ఆసక్తి కర అంశాలు చోటు చేసుకుంటున్నాయి. సుప్రీం ఆదేశాల తరువాత స్పీకర్ తన కార్యాచరణ వేగవంతం చేసారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. వారు తాజాగా స్పీకర్ నోటీసులకు తమ సమాధానం ఇచ్చారు. అందులో కీలక అంశాలను ప్రస్తావించారు. ఇద్దరు ఎమ్మెల్యేల విషయంలో మాత్రం కొంత సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో.. ఇప్పుడు స్పీకర్ నెక్స్ట్ స్టెప్ ఏంటనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. స్పీకర్ జారీ చేసిన ఫిరాయింపు నోటీసులకు 8 మంది ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చారు. తాము బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నామని స్పీకర్‌కు వివరించారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామని ఈ మేరకు సభాపతి నోటీసులకు సమాధానం ఇచ్చారు. అయితే కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం తమకు మరింత గడువు కావాలని స్పీకర్‌ను కోరినట్లు సమాచారం.
ALSO READ: https://teluguprabha.net/telangana-news/heavy-rain-alert-to-telangana-ap-districts/
ఇంకా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నాం..
తాము ప్రధానంగా తాము పార్టీ మారలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతున్నామని, ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని చెప్పినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు మూడు నెలల్లోగా వీరి పైన నిర్ణయం తీసుకోవాలని సూచించటంతో సభాపతి వీరి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీచేశారు. దీంతో, స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, సంజయ్, అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, తెల్లం వెంకట్రావు శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు లిఖితపూర్వకంగా సమాధానాలిచ్చారు. కానీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం సమాధానాలివ్వడానికి తమకు మరికొంత సమయం కావాలని స్పీకర్‌ను కోరినట్లు సమాచారం. తాము ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని.. బీఆర్ఎస్కు రాజీనామా చేయలేదని అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశామని ఆ సందర్భంగా మర్యాదపూర్వకంగా కండువా కప్పారని వివరించినట్లు సమాచారం. పైగా అది కాంగ్రెస్ పార్టీ కండువా కాదని 8 మంది ఎమ్మెల్యేలు వేర్వేరుగా వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు వీరి సమాధానాల ఆధారంగా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.


