అప్పుల బాధతో సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం కొత్తపల్లిలో ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడటంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
“ఇదేనా రేవంత్.. నువ్వు తీసుకొచ్చిన మార్పు? పైసలతో దగదగమెరిసిన చేతుల్లోకి.. పురుగుల మందుల డబ్బాలు రావడమే మార్పా? ఆదాయంతో నిండిన ఆనందమయ జీవితాల్లోకి.. ..ఆత్మహత్య ఆలోచన చొరబడటమే మార్పా? రేవంత్.. ఆటోడ్రైవర్లకు నువ్వు ఇస్తానన్న 12వేల రూపాయల సాయమేది? రాహుల్ గాంధీ..ఆటో వాలాలకు నీ ఆపన్నహస్తమేది? ఆటో డ్రైవర్లనే కాదు.. అన్ని వర్గాలను మోసగించారు! తెలంగాణను తడిగుడ్డతో గొంతుకోస్తున్నారు! ఇదే..ఏడాది కాలంగా తెలంగాణ చూస్తున్న మార్పు” అంటూ ట్వీట్ చేశారు.
కాగా సిద్ధిపేట జిల్లా కొత్తపల్లికి చెందిన పంగ యాదగిరి(48) హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆటో నడిపినా కుటుంబ పోషణకు సరైన ఆదాయం రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.