బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలిపేందుకు కేటీఆర్ వెళ్లే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆయన ఇంటి వద్దకు భారీగా చేరుకుని హౌస్ అరెస్ట్ చేశారు. పర్యావరణ విధ్వంసానికి వ్యతిరేకంగా యూనివర్సిటీలో విద్యార్థులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం విద్యార్థులు కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. దీంతో విద్యార్థుల ఆందోళనకు అండగా ఉంటానని ఆయన భరోసానిచ్చారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. మరోవైపు హెచ్‌సీయూ భూములను పరిశీలించేందుకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. కాగా కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లోని చెట్లను జేసీబీల సాయంతో ప్రభుత్వం తొలగించడాన్ని ప్రతిపక్షాలు, విద్యార్థులు, పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.